Telangana: తెలంగాణ విద్యుత్తు రంగంలోకి కోల్ ఇండియా.. సింగరేణికన్నా తక్కువ వ్యయంతో ఏర్పాటు!
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ బొగ్గు సంస్థ కోల్ ఇండియా తొలిసారిగా తెలంగాణ విద్యుత్తు రంగంలోకి అడుగుపెట్టింది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బెస్) ఏర్పాటుకు నిర్వహించిన టెండర్‌లో అర్హత సాధించిన సంస్థగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ సమీపంలో 187.50 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో బెస్ ప్లాంట్‌ను నిర్మించనుంది. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు నాలుగు గంటల పాటు మొత్తం 750 మెగావాట్ల విద్యుత్తును తెలంగాణ అవసరాల కోసం సరఫరా చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే మందమర్రిలో బెస్‌ను నిర్వహిస్తూ ఆదాయం పొందుతున్న సింగరేణి ఈ టెండర్‌లో పాల్గొనకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
రెండు ప్రాజెక్టుల ఏర్పాటు కోసం మొత్తం రూ.1,260.98 కోట్ల వ్యయం
మందమర్రిలో మెగావాట్ సామర్థ్యంతో బెస్ ఏర్పాటు చేయడానికి సింగరేణి రూ.86 లక్షలు ఖర్చు చేసినట్లు రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) ఇటీవల రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో చౌటుప్పల్‌లో కోల్ ఇండియా, మహేశ్వరంలో సారస్ అనే ప్రైవేటు సంస్థ బెస్ ప్లాంట్లను సింగరేణి కంటే తక్కువ వ్యయంతో నిర్మించనున్నట్లు జెన్‌కో పేర్కొంది. ఈ రెండు ప్రాజెక్టుల ఏర్పాటు కోసం మొత్తం రూ.1,260.98 కోట్ల వ్యయం అంచనా వేసింది. మొత్తం 1,500 మెగావాట్ల సామర్థ్యానికి లెక్కిస్తే మెగావాటుకు సగటున రూ.84 లక్షల చొప్పున ఈ సంస్థలు ఖర్చు చేస్తున్నట్లు వివరించింది.
వివరాలు
నిధుల కొరతా?.. లేక పెండింగ్ బిల్లుల ప్రభావమా?
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బెస్ పరికరాల ధరలు పెరిగినప్పటికీ, సింగరేణి వ్యయంతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే ఈ సంస్థలు టెండర్లను దక్కించుకోవడం విశేషంగా మారింది. మందమర్రిలో ఏర్పాటు చేసిన బెస్ ద్వారా కేవలం నాలుగు నెలల్లోనే రూ.26 లక్షల విలువైన విద్యుత్తు ఆదా చేసినట్లు సింగరేణి ఇటీవల ప్రకటించింది. పగటి వేళల్లో ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్తును ఉచితంగా గ్రిడ్‌కు పంపకుండా బ్యాటరీల్లో నిల్వ చేసి, అవసరమైన సమయంలో వినియోగించే అవకాశం బెస్ వ్యవస్థ కల్పిస్తోంది. దీంతో సింగరేణికి గణనీయమైన ప్రయోజనం లభిస్తోంది.
వివరాలు
రూ.15వేల కోట్ల మేర బకాయిలు
అయితే ఇలాంటి అనుభవం ఉన్నప్పటికీ సింగరేణి బెస్ టెండర్‌లో పాల్గొనకపోవడం వెనుక ఆర్థిక కారణాలే ప్రధానమని భావిస్తున్నారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లా పెగడపల్లి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా చేస్తున్నప్పటికీ,డిస్కంలు సింగరేణికి సుమారు రూ.10 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. అలాగే బొగ్గు కొనుగోలు చేసిన జెన్‌కో నుంచి మరో రూ.15వేల కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందని తెలుస్తోంది. ఈ భారీ పెండింగ్ బిల్లులతో పాటు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన నిధుల కొరత కూడా సింగరేణిపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అప్పులు తీసుకుని బెస్ ప్లాంట్ నిర్మించి విద్యుత్తును జెన్‌కోకు విక్రయించినా, చెల్లింపులు సకాలంలో అందకపోవచ్చనే ఆందోళనతోనే ఈ టెండర్లపై ఆసక్తి చూపలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.