Rain Alert: ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాంధ్ర తీర ప్రాంతం నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి,కర్ణాటక నుంచి రాయలసీమ,తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ రెండు ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండురోజుల పాటు మేఘావృతమైన వాతావరణం కొనసాగడంతో పాటు,పలు ప్రాంతాల్లో చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోమవారం కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని,రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
వివరాలు
మంగళగిరిలో అత్యధికంగా 68.2 మిల్లీమీటర్ల వర్షం
ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం, గుంటూరు జిల్లా మంగళగిరిలో అత్యధికంగా 68.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. విజయనగరం జిల్లా రాజాంలో 52.5 మిల్లీమీటర్లు, గుంటూరు జిల్లా కాకుమానులో 51.5 మిల్లీమీటర్లు, తాడేపల్లిలో 45.2 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా కవులూరులో 41.5 మిల్లీమీటర్లు, బాపట్ల జిల్లా భట్టిప్రోలులో 39.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాజమహేంద్రవరంలో ఆదివారం మధ్యాహ్నం దాదాపు గంటపాటు కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.