Loading...
1/70 Act: గిరిజనుల భూములకు రక్షణగా 1/70 చట్టం.. సవరణకు కూటమి ప్రభుత్వం నో
గిరిజనుల భూములకు రక్షణగా 1/70 చట్టం.. సవరణకు కూటమి ప్రభుత్వం నో

1/70 Act: గిరిజనుల భూములకు రక్షణగా 1/70 చట్టం.. సవరణకు కూటమి ప్రభుత్వం నో

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

గిరిజనులను ఏళ్లుగా వేధిస్తున్న భూముల సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఆంధ్రప్రదేశ్'లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్డ్‌ ఏరియాకు వర్తించే 1/70 చట్టంలో ఎలాంటి సవరణలు చేయకూడదని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయానికి అనుగుణంగా సుప్రీంకోర్టులో ఇప్పటికే కొంతమంది గిరిజనేతరులు దాఖలు చేసిన పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గిరిజనులకు అనుకూలంగా అఫిడవిట్‌ దాఖలు చేయనుంది. ఇందుకు సంబంధించిన కసరత్తును గిరిజన సంక్షేమశాఖ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై న్యాయనిపుణుల సలహాలను కూడా తీసుకున్నారు.

వివరాలు 

1/70 చట్టమంటే ఏంటి?

షెడ్యూల్డ్‌ ఏరియాలో భూముల బదిలీని నియంత్రించే చట్టమే 1/70. దీని ప్రకారం అక్కడి భూములను గిరిజనులకు మాత్రమే బదిలీ చేయాలి.

గిరిజనేతరులకు భూములను బదిలీ చేయడానికి అవకాశం ఉండదు.

ఒక గిరిజన కుటుంబంలో ఆ భూమిని వారసత్వంగా పొందేందుకు ఎవరూ లేకపోతే.. ఆ భూమి ప్రభుత్వానికి చెందుతుంది.

అంతే తప్ప గిరిజనేతరులకు దానిపై హక్కు కల్పించరు. అలాగే సంస్థలు, పరిశ్రమలకు కూడా ఈ భూములను కేటాయించేందుకు నిబంధనలు అనుమతించవు.

1970లో ఈ నిబంధనలను తీసుకురావడంతో దీనిని 1/70 చట్టంగా వ్యవహరిస్తున్నారు.

షెడ్యూల్డ్‌ ఏరియాలోని తమ భూములకు ఈ చట్టం శ్రీరామరక్షగా ఉంటుందని గిరిజనులు భావిస్తుంటారు.

తమ భూములు గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించడంలో 1/70 చట్టం కీలక పాత్ర పోషిస్తుందని వారు నమ్ముతున్నారు.

వివరాలు 

సమస్య ఎక్కడ వచ్చింది?

1970లో 1/70 చట్టం అమల్లోకి రాకముందే షెడ్యూల్డ్‌ ఏరియాలోని కొంత భూమి కొంతమంది గిరిజనేతరుల చేతుల్లో ఉంది.

ప్రస్తుతం కూడా వారు ఆ భూములను అనుభవిస్తున్నారు.అయితే ఈ భూములను క్రయవిక్రయాలు చేయాలంటే 1/70 చట్టం నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి.

దీంతో తమకు సంబంధించిన భూములను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించాలని, అందుకు అనుగుణంగా చట్టంలో సవరణలు చేయాలని కొంతమంది గిరిజనేతరులు కోరుతున్నారు.

ఈ అంశంపై తెలంగాణ నుంచి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఇందులో రాష్ట్రానికి చెందిన కొంతమంది గిరిజనేతరులు కూడా ఇంప్లీడ్‌ అయ్యారు.

1/70 చట్టానికి సవరణలు చేసే అవకాశం ఉందన్న ప్రచారం గిరిజనుల్లో ఆందోళనకు కారణమైంది.

తమ భూములపై ఉన్న రక్షణను తొలగించేలా ఎలాంటి మార్పులు చేయకూడదని వారు కోరుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రత్యామ్నాయంగా భూములిచ్చే ప్రతిపాదనపై కసరత్తు

1/70 చట్టాన్ని సవరించకుండానే గిరిజనేతరులకు ఎలా న్యాయం చేయాలన్న అంశంపై ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది.

ఇందులో భాగంగా 1970కు ముందు షెడ్యూల్డ్‌ ఏరియాలో గిరిజనేతరుల చేతుల్లో ఎంత భూమి ఉందన్న వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

అలాగే ఆయా ఐటీడీఏల పరిధిలో గిరిజనేతరులపై స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, పీవో, కలెక్టర్‌ పరిధిలో ఇప్పటివరకు ఎన్ని ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ రెగ్యులేషన్‌ (ఎల్‌టీఆర్‌) కేసులు నమోదయ్యాయన్న సమాచారాన్ని కూడా అధికారులు సేకరిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రత్యామ్నాయంగా భూములిచ్చే ప్రతిపాదనపై కసరత్తు

ఈ వివరాల ఆధారంగా 1/70 చట్టానికి ఎలాంటి సవరణ చేయకుండా, ఇప్పటికే భూములు పొందిన గిరిజనేతరులకు ప్రత్యామ్నాయంగా ఎలా న్యాయం చేయాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

షెడ్యూల్డ్‌ ఏరియాలో ప్రస్తుతం భూములు కలిగి ఉన్న గిరిజనేతరులకు ఇతర ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ భూములు కేటాయించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇలా చేయడం ద్వారా ఒకవైపు 1/70 చట్టానికి రక్షణ కల్పిస్తూ, మరోవైపు 1970కు ముందే భూములు కలిగి ఉన్న గిరిజనేతరుల సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT