Rain Alert: నేడు తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. ఏపీలోని పలు జిల్లాలకు వర్ష హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం ఉదయం హల్దియా సమీపంలో ఈ తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్'లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
వివరాలు
సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం
అలాగే శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో కూడా చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.
ఉరుములు, పిడుగులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
తీవ్ర వాయుగుండం తీరం దాటనున్న నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
కోస్తా ప్రాంతంలోని మిగతా ఓడరేవులకు మొదటి నంబరు ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.