Page Loader
Cold Wave: చలికి గజగజ వణుకుతున్న జనం.. ఒక్కసారిగా సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
Cold Wave: చలికి గజగజ వణుకుతున్న జనం..

Cold Wave: చలికి గజగజ వణుకుతున్న జనం.. ఒక్కసారిగా సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 03, 2025
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉమ్మడి మెదక్ జిల్లాపై చలి తీవ్రత పెరుగుతోంది. చలి కారణంగా ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా సింగిల్ డిజిట్‌కు పడిపోవడం అందరికీ ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలో నమోదు కావడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6.9 డిగ్రీలు, న్యాల్కల్‌లో 8.2 డిగ్రీలు, అల్గోల్‌లో 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ జిల్లాలో టేక్మాల్ 9.3 డిగ్రీలు, నర్సాపూర్ 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలను నమోదు చేయగా, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్‌లో 9.7 డిగ్రీలు, బేగంపేటలో 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వివరాలు 

సాయంత్రం 5 గంటల కాగానే చలి ప్రభావం

సాయంత్రం 5 గంటల కాగానే చలి ప్రభావం ప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటల తరువాత అది మరింతగా పెరిగి ఉదయం 8 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం, సాయంత్రం చలి గాలులకు ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. పిల్లలు స్కూళ్లకు వెళ్లడంలో, పాలు, కూరగాయలు అమ్మే వారికి ఈ చలి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. వాతావరణ నిపుణులు చలి తీవ్రత రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

వివరాలు 

జాతీయ రహదారులపై తీవ్రంగా పొగమంచు 

ఉదయం పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఉదయం 8 గంటల వరకు కూడా మంచు దుప్పటి కమ్మేస్తోంది. ముఖ్యంగా జాతీయ రహదారులపై పొగమంచు తీవ్రంగా ఉండటం వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు మానుకోవడం మంచిదని, అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, దివ్యాంగులు, బాలింతలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.