Cold Waves Effect : తెలంగాణలోని ఈ 25 జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఈ వార్తాకథనం ఏంటి
చలి పంజా విసురుతోంది.. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లోకి పడిపోవడంతో ఉదయం, సాయంత్రం బయటకు రావాలనేవారికి చలి భయం సృష్టిస్తోంది. ఇప్పటికే 25 జిల్లాల్లో చలి తీవ్రంగా ఉంది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లోకి దిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం, వచ్చే మూడు రోజుల్లో చలి మరింత పెరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. సాధారణ స్థాయికి కంటే ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. అయితే, తీవ్రమైన చలితో తెలంగాణ ప్రజలు గజగజా వణికిపోతున్నారు.
వివరాలు
రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో చలి మరింత తీవ్రం
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల మధ్యగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు, దాదాపు 20 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయని వివరించింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో చలి మరింత తీవ్రమవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. డిసెంబర్ 10 నుంచి 13 వరకు చలిగాలులు బలంగా వీచే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో ఉదయం, సాయంత్రం ప్రజలకు కష్టం తప్పదు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి కంటే 5-7 శాతం తగ్గే అవకాశం ఉందని, మధ్య తెలంగాణలో (హైదరాబాద్ సహా) 3-4 శాతం తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
వివరాలు
తిర్యాణి లో 6.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
వాతావరణ శాఖ వివరాలు ప్రకారం.. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి లో 6.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదిలాబాద్‌లో 6.3, సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో 6.4, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 6.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక, ఈ నెల 16వ తేదీ వరకు హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 9 నుంచి 12 డిగ్రీల మధ్యగా ఉండే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.