Cold Waves: తెలుగు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న చలి.. 10 ఏళ్ల రికార్డు బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పడిపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చలి ప్రభావం కనిపిస్తోంది. ఉదయం మాత్రమే కాకుండా, రాత్రి వేళల్లో కూడా తీవ్ర చలి కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 4.5 నుంచి 11.2 డిగ్రీల సెల్సియస్ మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. దాదాపు 10 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ ఈ చలి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. అయితే ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ ప్రాంతంలో కూడా గడ్డకట్టించే చలి నెలకొంది.
Details
రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం
ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్ జిల్లాలను మినహాయిస్తే, మిగిలిన చాలా జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో 10 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 5.4, మెదక్‌లో 5.4, వికారాబాద్‌లో 8.2 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఆదివారం, సోమవారం చలి తీవ్రత ఎక్కువగా ఉండబోతుందని స్పష్టం చేశారు.
Details
ఏపీలోనూ 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్పంగా 5 డిగ్రీల లోపు సెల్సియస్ నమోదవుతూ ప్రజలను వణికిస్తోంది. అక్కడి ప్రజలు తీవ్రమైన చలి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులో రాష్ట్రంలోనే అత్యల్పంగా 3.5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే పార్వతీపురం మన్యం, చిత్తూరు, కాకినాడ, ఎన్టీఆర్, నంద్యాల, ఏలూరు, అనకాపల్లి, విజయనగరం, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, కర్నూలు, అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో కూడా 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.