Year Ender 2025 : ప్రజల హృదయాలను గెలిచిన కలెక్టరమ్మలు
ఈ వార్తాకథనం ఏంటి
అధికారం చేతికి వచ్చిందంటే కొందరు పెత్తనం చలాయిస్తారు. అదే అధికారాన్ని ప్రజాసేవకు అంకితం చేసే వారు మాత్రం అరుదు. అలాంటి అరుదైన రెండో కోవలో నిలిచినవారే ఈ యువ ఐఏఎస్ అధికారిణులు. బాధ్యతను హోదాగా కాకుండా సేవగా భావిస్తూ, ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొస్తున్నారు.
Details
'మా కలెక్టర్ ప్రపంచంలోనే అత్యుత్తమం'
తమిళనాడు తంజావూరు జిల్లాలో కలెక్టర్‌గా పనిచేస్తున్న ప్రియాంక బాలసుబ్రమణ్యన్‌కు అక్కడి ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. మా కలెక్టర్ ప్రపంచంలోనే బెస్ట్" అంటూ ఆమెను గర్వంగా చెప్పుకుంటున్నారు.అధికారిణిగా కాకుండా సాటి మనిషిగా ప్రజల సమస్యలను అర్థం చేసుకుని స్పందించడమే ఆమె ప్రత్యేకత. కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరిస్తూ, సమస్యను వినిపించి, పరిష్కారానికి వెంటనే ఆదేశాలు జారీ చేస్తారు. గిండీ కాలేజ్ నుంచి ఇంజినీరింగ్, ఐఐఎమ్ బెంగళూరు నుంచి ఎంబీఏ పూర్తిచేసిన ప్రియాంక,కార్పొరేట్ కెరీర్‌ను పక్కనపెట్టి సివిల్ సర్వీస్‌ను ఎంచుకున్నారు. విద్యారంగం ఆమెకు అత్యంత ప్రాధాన్యం. తరచూ పాఠశాలలను సందర్శిస్తూ బోధన, పోషకాహారం, నైపుణ్యాభివృద్ధి అంశాల్లో రాజీ లేని వైఖరిని చూపిస్తున్నారు. అధికార దర్పం ఆమె ప్రవర్తనలో ఎక్కడా కనిపించదు.
Details
ఏఐతో విద్యలో మార్పు
రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న డాక్టర్ సౌమ్య ఝా విద్యారంగ సమస్యలను వినూత్నంగా పరిష్కరించారు. పదో తరగతి విద్యార్థుల్లో 90 శాతం మంది సైన్స్ చదవాలనుకుంటున్నామని చెబుతున్నప్పటికీ, వాస్తవంగా ఆ గ్రూపుల్లో చేరేవారు కేవలం 12 శాతమే ఉండేవారు. గణితంపై భయం ప్రధాన కారణం. టీచర్ల కొరత, లోతైన బోధన లేకపోవడం, గైర్హాజరీలు... ముఖ్యంగా హిందీ మీడియం విద్యార్థుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండేది. దీనికి పరిష్కారంగా సౌమ్య ఝా ఏఐ టెక్నాలజీని వినియోగించారు. 'పఢాయీవిత్‌ఏఐ.ఇన్' పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇందులో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి,వారు సమాధానం రాయని ప్రశ్నలను గుర్తించి, ఆ అంశాలపై ప్రత్యేక వివరణ ఇచ్చేలా వ్యవస్థ రూపొందించారు. ఫలితంగా గణితంలో ఉత్తీర్ణత శాతం మూడు పాయింట్లు పెరిగింది.
Details
వరదల్లోనూ వెనుకడుగు లేదు
పంజాబ్‌లో ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో సంభవించిన భారీ వరదల సమయంలో అమృత్‌సర్ డెప్యూటీ కమిషనర్‌గా ఉన్న సాక్షి సాహ్నెయ్ అజ్నాలా జిల్లాలో ప్రత్యేక అధికారిగా క్షేత్రస్థాయిలో పనిచేశారు. 20 గ్రామాల్లో వరద తీవ్రత అధికంగా ఉండటంతో సహాయ చర్యలకు స్వయంగా నేతృత్వం వహించారు. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, రెడ్‌క్రాస్ బృందాల మధ్య సమన్వయం చేస్తూ వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మోకాలి లోతు నీళ్లలోకి వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం ఆమె ధైర్యాన్ని చాటింది. అనంతరం బాధితులు తలదాచుకున్న ఇళ్లు, పాఠశాలలు, ఆస్పత్రులను పరిశీలిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆమె గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్‌గా కొనసాగుతున్నారు.