Hyderabad: వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత.. హైదరాబాద్‌లో హోటళ్లకు కష్టకాలం
ఈ వార్తాకథనం ఏంటి
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడం రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో అనేక హోటళ్లు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. మరికొన్ని హోటళ్ల నిర్వాహకులు మెనూను తగ్గించడంతో పాటు ధరలను కూడా పెంచుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని హోటళ్ల అసోసియేషన్ తాత్కాలికంగా టీ, కాఫీ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఎక్కువ సమయం పట్టే, అధికంగా నూనె వినియోగించే చపాతి, దోసె, పూరీ వంటి వంటకాలను ప్రస్తుతం అందుబాటులో ఉంచడం లేదని తెలిపారు. టిఫిన్ బండ్ల నుంచి స్టార్ హోటళ్ల వరకు వంటకాలు తయారుచేయడానికి ఎక్కువగా గ్యాస్‌పైనే ఆధారపడుతున్నారు.
వివరాలు
ప్రత్యామ్నాయలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా లేదు: హోటల్ యజమానులు
ప్రస్తుతం తమ వద్ద ఉన్న సిలిండర్లు ఒకటి లేదా రెండు రోజులకంటే ఎక్కువ కాలం సరిపోవని నిర్వాహకులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే హోటళ్లను పూర్తిగా మూసివేయడం తప్ప మరో మార్గం ఉండదని వారు పేర్కొంటున్నారు. గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలు లేదా ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్‌లు ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా లేదని హోటల్ యజమానులు చెబుతున్నారు.
వివరాలు
అన్నం.. పప్పు.. రసం మాత్రమే
హైదరాబాద్‌లోని పీజీ హాస్టళ్లు, మెస్‌లలో కూడా వంటకు 90 శాతం కంటే ఎక్కువగా గ్యాస్‌పైనే ఆధారపడుతున్నారు. ఇప్పటికే సిలిండర్ల కొరత కారణంగా మెనూలో మార్పులు చేయాల్సి వచ్చింది.ఎక్కువ సమయం పట్టే వంటలను తగ్గించి ప్రస్తుతం అన్నం, సాంబారు, పప్పు, రసం వంటి సాదా వంటకాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇంకా రెండు లేదా మూడు రోజుల తర్వాత గ్యాస్ సమస్య అలాగే కొనసాగితే వంట పూర్తిగా నిలిపివేసి హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఎస్సార్‌నగర్,అమీర్‌పేట,కేపీహెచ్‌బీ,గచ్చిబౌలి,మాదాపూర్,కొండాపూర్,అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రాంతాల్లో వందల సంఖ్యలో హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో నివసించే విద్యార్థులు, ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న నిరుద్యోగులపై ఈ పరిస్థితి తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.
వివరాలు
ఈ వంటకాల ధరలు కనీసం రూ.15 వరకు పెరిగాయి
గ్యాస్ కొరతతో పాటు నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల హోటళ్లు కూడా ధరలను పెంచాయి. రవాణా ఛార్జీలు పెరగడంతో అల్పాహారాలపై సుమారు 10శాతం వరకు ధరలు పెంచారు. దోసె, పూరీ, వడ వంటి వంటకాల ధరలు కనీసం రూ.15 వరకు పెరిగాయి. ఇడ్లీ, ఉప్మా వంటి వాటిపై రూ.10 వరకు పెంపు చేశారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో అయితే సుమారు 15 శాతం వరకు ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. తాము గత 22 సంవత్సరాలుగా హోటల్ నిర్వహిస్తున్నామని, కానీ గత మూడు రోజులుగా వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అందడం లేదని ఉప్పల్‌కు చెందిన హోటల్ యజమాని కె. నారాయణ తెలిపారు. ఈ పరిస్థితి కొనసాగితే హోటల్‌ను మూసివేయాల్సిన పరిస్థితి తప్పదని ఆయన చెప్పారు.