LOADING...
Hyderabad:కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల కొరత.. హైదరాబాద్‌లో హోటళ్లు, హాస్టళ్లకు గండం
కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల కొరత.. హైదరాబాద్‌లో హోటళ్లు, హాస్టళ్లకు గండం

Hyderabad:కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల కొరత.. హైదరాబాద్‌లో హోటళ్లు, హాస్టళ్లకు గండం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2026
01:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

కమర్షియల్‌ (వాణిజ్య) గ్యాస్‌ సిలిండర్ల కొరత కారణంగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముంబైలో ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్య మరికొన్ని రోజులు కొనసాగితే అక్కడ సగం వరకు హోటళ్లు మూతపడే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ప్రభావం ఇప్పుడు హైదరాబాద్‌పైనా పడుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఆయిల్‌ కంపెనీలు ఇండెంట్‌లు స్వీకరించడం లేదని పేర్కొంటూ గ్యాస్‌ వెండర్లు సోమవారం నుంచి కమర్షియల్‌ సిలిండర్ల పంపిణీని పూర్తిగా నిలిపివేశారు.

వివరాలు 

చాలా హాస్టళ్లలో మెనూలో కోతలు

దీంతో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల లభ్యతపై తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా హాస్టళ్లు, హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ కష్టంగా మారే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగితే వంట చేయడం కూడా కష్టమవుతుందని హాస్టళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా హాస్టళ్లలో మెనూలో కోతలు పెట్టారు. సాధారణంగా పేయింగ్‌ గెస్ట్‌ (పీజీ) హాస్టళ్లలో ఉదయం టిఫిన్‌గా ఇడ్లీ, దోశ, పూరీ, బోండా వంటి పదార్థాలు ఇస్తుంటారు. మధ్యాహ్న భోజనంలో చపాతీ, అన్నం, పప్పు, కూరలు ఉంటాయి. రాత్రి భోజనంలో కర్రీతో పాటు ఫ్రై కూడా అందిస్తారు. అయితే ప్రస్తుతం టిఫిన్‌, డిన్నర్‌లలో కొన్ని ఐటమ్స్‌ను తొలగించాల్సి వచ్చినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

వివరాలు 

ఐటీ కారిడార్‌లో తీవ్ర చర్చ

పీజీ హాస్టళ్లలో వంట సమస్యపై హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో పెద్ద చర్చ కొనసాగుతోంది. నగరంలో దాదాపు 11 వేల హాస్టళ్లు, 3 వేలకుపైగా హోటళ్లు,రెస్టారెంట్లు ఉన్నాయని అంచనా. ఐటీ ఉద్యోగులు, ఉన్నత ఆదాయ వర్గాల ఉద్యోగులు, వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులు కలిపి సుమారు 10 లక్షల మంది హాస్టళ్లలో నివసిస్తున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌, శేరిలింగంపల్లి, గోపన్‌పల్లి, మియాపూర్‌, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట‌, మణికొండ‌, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌ వంటి ప్రాంతాల్లో వందల సంఖ్యలో పీజీ హాస్టళ్లు, గెస్ట్‌ హౌస్‌లు ఉన్నాయి. ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్‌, చందానగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, కొండాపూర్‌ ప్రాంతాల్లోనే దాదాపు వెయ్యి హోటళ్లు పనిచేస్తున్నాయి. వీటిలో చాలా వరకు వంట గ్యాస్‌పై ఆధారపడి ఉంటుంది.

Advertisement

వివరాలు 

సామాన్యులపై ప్రభావం

ఇలాంటి పరిస్థితిలో గ్యాస్‌ కొరత తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. కొన్నిచోట్ల ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని బ్లాక్‌ మార్కెట్‌ విక్రయాలు కూడా పెరుగుతున్నాయి. ఒక్కో కమర్షియల్‌ సిలిండర్‌ను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా హోటళ్లలో రెండు నుంచి మూడు రోజులకు సరిపడా గ్యాస్‌ నిల్వ ఉంచుతారు. ఆ నిల్వలు పూర్తయితే వంటగదులు మూసివేయాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా కొనసాగితే హోటళ్లను నడపడం అసాధ్యమవుతుందని హోటల్స్‌ అసోసియేషన్‌ నాయకులు చెబుతున్నారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.

Advertisement

వివరాలు 

హలీం తయారీలో కట్టెల పొయ్యులు

ప్రస్తుతం రంజాన్‌ మాసం కొనసాగుతున్నందున హైదరాబాద్‌లో హోటళ్ల వ్యాపారం సాధారణంగా బాగా ఉంటుంది. హలీం తయారీలో కట్టెల పొయ్యులు ఉపయోగించడంతో కొంత ఉపశమనం లభిస్తోంది. అయితే మిగతా వంటకాలకు గ్యాస్‌పై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో వ్యాపారులు, వినియోగదారులు ఇద్దరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే చాలా హోటళ్లు మెనూలో ఐటమ్స్‌ తగ్గించడం లేదా పనివేళలను తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

వివరాలు 

కమర్షియల్‌ సిలిండర్ల పంపిణీపై చర్యలు తీసుకోవాలి

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో పీజీ హాస్టళ్లపై తీవ్ర ప్రభావం పడుతోందని ఐటీ కారిడార్‌ హాస్టళ్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. కట్టెల పొయ్యులపై వంటలు చేసి సమయానికి అందించడం సాధ్యం కాదన్నారు. కమర్షియల్‌ సిలిండర్ల సరఫరాను వెంటనే పునరుద్ధరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమస్యపై చర్చించేందుకు బుధవారం ఉదయం 10.30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు అమర్‌నాథ్‌రెడ్డి, ఐటీ కారిడార్‌ హాస్టళ్ల అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌, ట్రెజరర్‌ మహీధర్‌ తెలిపారు. రాయదుర్గంలోని ప్రశాంతి హిల్స్‌లో జరగనున్న ఈ సమావేశంలో గ్యాస్‌ కొరత వల్ల హాస్టళ్లపై పడుతున్న ప్రభావాన్ని వివరించనున్నారు.

వివరాలు 

20 శాతం పెరిగిన బుకింగ్‌లు

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్‌ కొరత ఏర్పడుతుందనే ప్రచారం నేపథ్యంలో సాధారణ రోజులతో పోలిస్తే గ్యాస్‌ బుకింగ్‌లు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయి. అవసరం లేకపోయినా ముందుగానే బుకింగ్‌లు చేయడం వల్ల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రెండు సిలిండర్ల బుకింగ్‌ల మధ్య కనీస వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గ్యాస్‌ నిల్వలు సరిపడా ఉన్నాయని, వినియోగదారులు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే గ్యాస్‌ బుక్‌ చేసుకోవాలని, వంటింట్లో గ్యాస్‌ ఆదా చేసే పద్ధతులను పాటించాలని సూచించారు.

Advertisement