Loading...
women journalists: జంతర్‌మంతర్‌ వద్ద కలకలం.. పోలీసులపై ముగ్గురు మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు
జంతర్‌మంతర్‌ వద్ద కలకలం.. పోలీసులపై ముగ్గురు మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు

women journalists: జంతర్‌మంతర్‌ వద్ద కలకలం.. పోలీసులపై ముగ్గురు మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2026
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా నిరసనకారులు అక్కడ ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో శనివారం నిరసనలు జరుగుతున్న సమయంలో పోలీసులు తమను లైంగికంగా వేధించారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో అక్కడ మహిళా సిబ్బంది ఎవరూ లేకపోవడాన్ని తాము ప్రశ్నించామని మహిళా జర్నలిస్టులు తెలిపారు. ఈ సమయంలో ఏసీపీ వివేక్‌ భగత్‌ తమను అసభ్యంగా తాకుతూ వెనక్కి నెట్టేశారని వారు ఆరోపించారు.

వివరాలు

వెయ్యి మందికిపైగా అదుపులోకి

ఈ ఆరోపణల నేపథ్యంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు ముగ్గురు మహిళా జర్నలిస్టులు చేసిన ఫిర్యాదులను క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులకు బదిలీ చేసినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు.

మరోవైపు జంతర్‌మంతర్‌ వద్ద కొనసాగుతున్న నిరసనలకు సంబంధించి ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

అయితే కొన్ని గంటల అనంతరం వారిని విడిచిపెట్టినట్లు వెల్లడించారు.

ఆందోళనలపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ.. సామాజిక సంస్థలు, విద్యార్థి సంఘాల నేతలు జంతర్‌మంతర్‌ వద్దకు భారీగా తరలిరావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆదివారం కూడా నిరసనలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో జంతర్‌మంతర్‌ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు.

వివరాలు

10న భారీ నిరసనకు పిలుపు

సీఈసీ పదవి నుంచి జ్ఞానేశ్‌ కుమార్‌ వైదొలగకపోతే ఈ నెల 10న దిల్లీలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించింది.

ఈ నిరసనలో దేశ ప్రజలంతా పాల్గొనాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.

స్పందించిన రాహుల్‌ గాంధీ

జంతర్‌మంతర్‌ వద్ద మహిళా జర్నలిస్టులు చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.

మహిళా జర్నలిస్టులపై అనుచిత చర్యలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.

ADVERTISEMENT