Andrapradesh: భూ వివాదాలపై సమగ్ర పరిష్కార చర్యలు.. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్
ఆంధ్రప్రదేశ్ లో భూ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భూ ఆక్రమణలు, సరిహద్దు వివాదాలు, మ్యుటేషన్లు, రికార్డు సవరణలు వంటి సమస్యలపై ఫిర్యాదులను జిల్లా స్థాయిలో స్వీకరించి, తక్షణ పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు అందిన 71,335 ఫిర్యాదుల్లో 66శాతం వరకు పరిష్కరించనట్లు సమచారం. ఫిర్యాదుల పరిష్కారంలో అన్నమయ్య, నంద్యాల, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్ జిల్లాలు మెరుగ్గా ఉన్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, విశాఖపట్నం, శ్రీసత్యసాయి, తిరుపతి, బాపట్ల జిల్లాలు వెనుకబడ్డాయి.
నెల్లూరు జిల్లాలో అత్యధిక ఫిర్యాదులు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 8,277 ఫిర్యాదులొచ్చాయి. కనిష్ఠంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 805 ఫిర్యాదులు మాత్రమే నమోదు కావడం విశేషం. ప్రజల ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం డిసెంబరు మొదటి వారంలో ప్రత్యేక రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని యోచిస్తోంది. గ్రామ, మండల స్థాయిలో చేపట్టే ఈ సభల ద్వారా వచ్చిన ఫిర్యాదులను 45 రోజుల వ్యవధిలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ప్రతిభాగితకు స్వీకరణ రసీదులు ఇవ్వడంతోపాటు, పరిష్కారంపై తెలుగులో సమాధానం అందజేస్తారు. ఈ ప్రక్రియ పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్‌గా నియమించారు.
డిసెంబర్ 3, 4 తేదీల్లో సచివాలయంలో ప్రత్యేక సదస్సులు
రీసర్వే పూర్తయైన 6,860 గ్రామాల్లో 2.76 లక్షల ఫిర్యాదులొచ్చాయి. వాటిలో భూముల విస్తీర్ణం తగ్గుదలపై 86 వేలు, సరిహద్దు వివాదాలపై 3 వేల ఫిర్యాదులు నమోదయ్యాయి. మరో 47 వేల ఫిర్యాదులు జాయింట్ ఎల్పీఎం కేటాయింపులపై ఉండడం గమనార్హం. వాటిని పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. డిసెంబరు 3, 4 తేదీల్లో వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని భూ సమస్యల పరిష్కారంపై ముఖ్య చర్చలు చేపట్టనున్నారు. ప్రజలకు న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.