Vijayawada Polling Stopped: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళం.. బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల గుర్తులు మార్పు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ విజయవాడలో గందరగోళం చోటుచేసుకుంది. నగరంలోని 55వ డివిజన్‌లో బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ముద్రించిన గుర్తులు తారుమారయ్యాయి. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలో ఈ ఘటన వెలుగుచూసింది. 55వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరుకు ఎదురుగా కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన హస్తం ముద్రించారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరుకు ఎదురుగా వైసీపీ గుర్తు అయిన ఫ్యాన్‌ను ముద్రించారు. దీంతో బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల పేర్లు, గుర్తుల మధ్య పొరపాటు జరిగినట్లు గుర్తించారు.
వివరాలు
తాత్కలికంగా పోలింగ్ నిలిపివేత
ఈ విషయంపై వైసీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా స్పందిస్తూ రిటర్నింగ్ అధికారి (ఆర్వో) చక్రవర్తికి ఫిర్యాదు చేశారు.
బ్యాలెట్ పేపర్లలో గుర్తులు మారడంపై ఫిర్యాదు అందడంతో అధికారులు స్పందించారు. ముందు జాగ్రత్త చర్యగా 55వ డివిజన్‌లో పోలింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.
అనంతరం కొత్త బ్యాలెట్ పేపర్లను ముద్రించిన తర్వాత తిరిగి పోలింగ్ ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉందని, ఆ తర్వాత 55వ డివిజన్‌లో ఓటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.