Congress: కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. ఏపీ, తెలంగాణకు కొత్త కార్యదర్శుల నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో భారీ సంస్థాగత మార్పులు చేపట్టింది. పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రాల్లో కార్యకలాపాలను వేగవంతం చేయడమే లక్ష్యంగా 81 మందిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శులుగా నియమించింది. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కొత్త కార్యదర్శులను నియమించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతలను సచిన్ సావంత్, సైమన్ అలెక్స్‌లకు అప్పగించారు.
వివరాలు
వివిధ రాష్ట్రాల్లోనూ కొత్త కార్యదర్శులు
ఆంధ్రప్రదేశ్‌తో పాటు అండమాన్ నికోబార్ దీవుల బాధ్యతలను సెంథిల్ అరసు, వి. శంకర్‌లకు కేటాయించారు.
ఈ నియామకాలతో తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాల నిర్వహణ, సమన్వయంపై కొత్త కార్యదర్శులు దృష్టి సారించనున్నారు.
మరోవైపు జాతీయ స్థాయిలో పార్టీ కమ్యూనికేషన్, ప్రచారం, సోషల్ మీడియా విభాగాల బాధ్యతలను గౌరవ్ పాంధీకి అప్పగించారు.
వివిధ రాష్ట్రాల్లోనూ కొత్త కార్యదర్శులను నియమించారు.
ఉత్తరప్రదేశ్‌కు ఆరుగురిని ఎంపిక చేయగా.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, పంజాబ్ వంటి కీలక రాష్ట్రాలకు నలుగురేసి చొప్పున కార్యదర్శులను నియమించింది.
వివరాలు
సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ఈ మార్పులని వెల్లడి
కొత్త నియామకాలతో పాటు ఇప్పటివరకు పార్టీకి సేవలందించిన 25 మంది ఏఐసీసీ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులకు కాంగ్రెస్ నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది.
రాష్ట్రాల్లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నాయకుల మధ్య సమన్వయాన్ని పెంచడం, సంస్థాగత కార్యకలాపాలను మెరుగుపరచడం ఈ పునర్‌వ్యవస్థీకరణ ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.