LOADING...
Rahul Gandhi: 'బీజేపీ ఉద్యోగులు కారు కదా?'.. మీడియాపై రాహుల్ గాంధీ అసహనం
'బీజేపీ ఉద్యోగులు కారు కదా?'.. మీడియాపై రాహుల్ గాంధీ అసహనం

Rahul Gandhi: 'బీజేపీ ఉద్యోగులు కారు కదా?'.. మీడియాపై రాహుల్ గాంధీ అసహనం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురువారం మీడియాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై అధికార పార్టీ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం (ప్రివిలేజ్ మోషన్) తీసుకురావచ్చన్న ప్రచారంపై జర్నలిస్టులు ప్రశ్నించడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటూ స్పష్టమైన సూచనలు చేశారు. పార్లమెంట్ ఆవరణలో తన వాహనం వద్దకు వెళ్తున్న సమయంలో రాహుల్‌ను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి ప్రివిలేజ్ మోషన్ అంశంపై స్పందన కోరారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహించిన ఆయన ఘాటుగా స్పందించారు.

వివరాలు 

'ప్రివిలేజ్' అన్నది ఈరోజు మీ కోడ్ వర్డా అంటూ ఘాటు వ్యాఖ్య

"ఈరోజు మీకు 'ప్రివిలేజ్' అనే పదమే కోడ్‌వర్డ్‌గా ఇచ్చారా? నిన్న 'ఆథెంటికేషన్' అన్నారు, ఈరోజు 'ప్రివిలేజ్' అంటున్నారు. మీరు పూర్తిగా బీజేపీకి పని చేసే వాళ్లు కాదుకదా? కాస్తైనా నిష్పక్షపాతంగా పని చేయాలని ప్రయత్నించండి" అంటూ వ్యాఖ్యానించారు. అలాగే, మీడియాకు ఒక బాధ్యత ఉందని, జర్నలిజం గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. ఇదిలా ఉండగా,లోక్‌సభలో ఒక రోజు ముందు మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దేశ ప్రయోజనాలను, భారతమాతను విదేశీ శక్తులకు తాకట్టు పెట్టినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సభా నియమాలకు విరుద్ధమని,ఆధారాలు లేని ఆరోపణలతో పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని బీజేపీ ఎంపీలు ఆరోపించారు.

వివరాలు 

రాహుల్‌పై చర్యలకు బీజేపీ యోచన

ఈ నేపథ్యంలో రాహుల్‌పై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామని వారు హెచ్చరించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి బలంగా మద్దతుగా నిలిచింది. ఇండో-యూఎస్ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే పూర్తి హక్కు ప్రతిపక్ష నాయకుడికి ఉందని పార్టీ స్పష్టం చేసింది. రాహుల్‌పై ప్రివిలేజ్ మోషన్ అంశంపై ఇప్పటివరకు అధికారిక నిర్ణయం వెలువడలేదు. అయితే, సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం స్థానంలో ఆయనపై సబ్‌స్టాంటివ్ మోషన్ రూపంలో నోటీసు ఇవ్వాలా అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Advertisement