
#NewsBytesExplainer: ప్రజాపాలన సరే.. మరి ప్రజలెందుకు దూరం అవుతున్నారు? కాంగ్రెస్‌లో అంతర్మథనం
ఈ వార్తాకథనం ఏంటి
రైతులు సహా ప్రతి వర్గానికి అనేక రకాల సంక్షేమ ఫలితాలు అందిస్తున్నప్పటికీ ప్రజలలో ప్రభుత్వ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో తీవ్ర అంతర్మథనం మొదలైంది. 'ప్రజా పాలన అని చెప్పుకుంటున్నాం.. మరి ప్రజలెందుకు దూరం అవుతున్నారు? లోపం ఎక్కడుంది? ఎందుకు సరిదిద్దడం లేదు' అని కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత నేతలే రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి నాయకులు, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు.
వివరాలు
42% రిజర్వేషన్ చట్టం
ఏఐసీసీ పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ ముందు నాయకులు రాష్ట్ర నాయకత్వాన్ని పలు ప్రశ్నలు వేయడం విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వం రూ. 99,500 కోట్లు సంక్షేమానికి ఖర్చు చేశామని ప్రకటించినప్పటికీ, పేద ప్రజలకు అది సరిగ్గా ఉపయోగపడలేదు. SC వర్గీకరణ చట్టాన్ని రూపొందించి, BC కులగణన ద్వారా దేశానికి ఆదర్శంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుని 42% రిజర్వేషన్ చట్టం తీసుకువచ్చినప్పటికీ, అవి ప్రజలకు అనుగుణంగా అమలుకాలేదు. రైతులకు రూ.21,500 కోట్ల రుణమాఫీ చేశామని ప్రకటించుకున్నా.. గ్రామాలలో రుణమాఫీ సరిగా అమలు చేయలేదన్నఅభిప్రాయం రైతుల నుంచి వ్యక్తం అవుతోందని ఒక నాయకుడు చెప్పినట్లు సమాచారం.
వివరాలు
అధికారులు రూపొందించిన గైడ్ లైన్స్ వల్లే
రుణమాఫీ అమలు కోసం అధికారులు రూపొందించిన గైడ్ లైన్స్ సరైనవి కాకపోవడంతో సమస్యలు పెరిగిపోతున్నాయని, కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ ఏంటని ఒకింత అసహనంతో ఆ నాయకుడు ప్రశ్నించారని సమాచారం. వ్యవసాయం చేయని భూమి యజమానులకు రుణమాఫీ చేశారు. అదే వ్యవసాయం చేసే రైతు కుటుంబాలకు పాస్ బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తే ఈ వ్యతిరేకత వచ్చేది కాదని సదరు నాయకుడు చెప్పినట్లు సమాచారం. గైడ్ లైన్స్ తేడాలు ప్రజలను పార్టీ నుండి దూరం చేస్తాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ సమస్యలను పరిశీలించి ప్రజలకు అనుగుణంగా మార్పులు చేయడంలో మనం విఫలమయ్యమని అంగీకరించాల్సి వస్తుందని చెప్పినట్లు సమాచారం.
వివరాలు
ప్రజా వ్యతిరేకతకు కారణమైన వ్యవసాయ శాఖ
ఇప్పటికే బీఆరెస్ కనుసన్నల్లో ఉన్న అధికారులు ఉద్దేశపూర్వకంగా ఈ గైడ్ లైన్స్ ఇచ్చారా?అన్న అనుమానాలు వస్తున్నాయని సదరు నాయకుడు అనుమానం వ్యక్తం చేశారు. ఇకయూరియా సరఫరా వ్యవహారంపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.వ్యవసాయ శాఖ అధికారులు తీరే యూరియా కొరతకు కారణమన్న అభిప్రాయం వెల్లడి అయ్యింది. మంచిగా వర్షాలు పడుతున్నప్పటికీ రైతులకు యూరియా సరఫరా చేయలేక పోవడం కూడా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి కారణమవుతోందని ఆయన అన్నారు. ఏటా కావాల్సినంత యూరియా రైతులకు అందుతున్నప్పుడు ఇప్పుడెందుకు ఇవ్వలేక పోయాం?ఒక్క మన పాలనలోనే యూరియా కొరత ఎందుకు వచ్చింది?అని మరొక్క నేత ప్రశ్నించినట్లు సమాచారం. అధికారులే కావాలని మనపై రైతులు తిరగబడాలని ఇలా చేస్తున్నారా?అన్న సందేహాలను కూడా పలువురునాయకులు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
వివరాలు
భూభారతితో మనం చేసిందేమిటి?
భూ భారతి పథకం పట్ల కూడా తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. పూర్వ బీఆరెస్ పాలకులు ధరణితో భూ దోపిడీ పాల్పడారని ఆరోపించి ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని ప్రకటించాం.. మన ప్రభుత్వం వచ్చిన తరువాత ధరణి స్థానంలో భూ భారతి తెచ్చాం.. కానీ రైతుల సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నామని కొందరు కార్యకర్తలు నాయకత్వాన్ని ప్రశ్నించినట్లు సమాచారం. భూ భారతి కార్యక్రమంలో ఇప్పటి వరకు వచ్చిన 8 లక్షల దరఖాస్తుల్లో కేవలం 26 వేలే పరిష్కరించడం ఏంటి. రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశం లేదా అంటూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాలు
భూభారతితో మనం చేసిందేమిటి?
పార్టీ అంతర్గత సమావేశంలో కొందరు నాయకులు అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. గైడ్ లైన్స్ ప్రజావ్యతిరేకంగా ఉండటం వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. " మనం అధికారంలోకి వచ్చి 22 నెలలు అయ్యింది. ఇప్పటి వరకు పాలనా కాలంలో కేవలం 30 శాతం పూర్తి అయింది. మిగిలిన 70 శాతానికి జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది' అని మరో నాయకుడు సూచించారు. అగ్ర నాయకత్వం ఇప్పటికైనా పాలసీల సమీక్ష చేసి, ప్రజలకు ఉపయుక్తమైన నిర్ణయాలు తీసుకోవాలని అభ్యర్థించారు.
వివరాలు
సంక్షేమం అంతంతే..
సంక్షేమ కార్యక్రమాల అమలుపై కూడా నిరసనలు వెల్లువెత్తినట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో ప్రతివారికి రూ.5 లక్షలు, SC/ST వర్గాలకు రూ.6 లక్షలు ఇస్తామని ప్రకటించి కూడా ఇంకా అమలు చేయకపోవడాన్ని ప్రశ్నించారు. మంచి నిర్ణయాలు తీసుకున్నా వాటిని సరైన విధంగా అమలు చేయలేకపోవడం వల్ల ప్రభుత్వ పట్ల సానుకూల వాతావరణం నెమ్మదిగా ప్రతికూలంగా మారిపోతున్నదని పార్టీ నాయకులు రాష్ట్ర నాయకత్వానికి తెలిపారు.