Congress : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరే!
కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీని ఆదివారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. ఈ కమిటీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు సీనియర్ నేతలకు చోటు లభించింది. 39 మందితో కూడిన సీడబ్ల్యూసీని ఏర్పాటు చేశారు. ఇందులో శాశ్వత ఆహ్వానితులుగా 18 మంది నేతలు, ప్రత్యేక ఆహ్వానితులగా 13 మందిని నియమించారు. సీడబ్ల్యూసీలో ఏపీ నుంచి రఘువీరారెడ్డికి చోటు లభించగా, తెలంగాణ నుంచి ఎవరికి ప్రాతినిధ్యం లభించకపోవడం గమనార్హం. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులగా , ఖర్గే ,సచిన్ పైలట్ , దిగ్విజయ్‌సింగ్ ,శశిథరూర్ , అధిరంజన్,జితేంద్రసింగ్ , అశోక్ చవాన్ , దీపక్ బవారియాకు అవకాశం లభించింది.
రేవంత్, ఉత్తం వర్గాలను నిరాశపరిచన కాంగ్రెస్ అదిష్టానం
ఇదిలా ఉండగా సీడబ్ల్యూసీలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. ఎన్నికల తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రాధాన్యత ఉంటుందని అంతా భావించినా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రం చోటు లభించలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత టి. సుబ్బిరామిరెడ్డిని శాశ్వత ఆహ్వానితుడిగా ఖర్గే ప్రకటించారు. రేవంత్, ఉత్తం వర్గాలను కాంగ్రెస్ అదిష్టానం నిరాశపరిచింది. అయితే దామోదర రాజనరసింహను శాశ్వత ఆహ్వానితులుగా ప్రకటించడం గమనార్హం.