Jammu Kashmir-congress-ncp seats: జమ్ముకశ్మీర్, లడఖ్ లో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఖరారైన సీట్ల పంపకాలు
లోక్ సభ ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీ పీ) ల మధ్య సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల నుంచి చెరో మూడు చోట్ల నుంచి పోటీ చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఉద్ధంపూర్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ లోక్ సభ సీట్ల లో పోటీ చేయనుంది. ఇక శ్రీనగర్, అనంతనాగ్, బారాముల్ల లోక్ సభ నియోజకవర్గాల నుంచి ఎన్సీపీ పోటీ చేయనుంది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా , కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ మేరకు ఢిల్లీలో కలసి సోమవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
అనంతనాగ్ రాజౌరీ నియోజవర్గంపై సర్వత్రా ఆసక్తి
ఇండియా కూటమి నుంచి పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ వైదొలుగుతున్నట్లు ప్రకటించిన తర్వాత... జమ్మూ కాశ్మీర్లోని అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో నూ పీడీపీ పోటీ చేయనున్నట్లు ముఫ్తీ స్పష్టం చేశారు. ఒమర్ అబ్దుల్లా సీట్ల పంపిణీపై సహకరించకపోవడం వల్లే పీడీపీ అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ముఫ్తీ వెల్లడించారు. కాగా, మెహబూబా ముఫ్తీ అనంతనాగ్ రాజౌరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ అజాద్ పార్టీ అధ్యక్షుడు, మాజీ కాంగ్రెస్ నేత గులామ్ నబీ అజాద్, ఎన్సీ నేత అల్తాఫ్ అహ్మద్ కూడా పోటీ చేయనుండటంతో ఇక్కడ పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.