LOADING...
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ కొత్త వ్యూహం.. యువ నేతలకు పెద్దపీట వేసే యోచన!
కర్ణాటకలో కాంగ్రెస్ కొత్త వ్యూహం.. యువ నేతలకు పెద్దపీట వేసే యోచన!

Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ కొత్త వ్యూహం.. యువ నేతలకు పెద్దపీట వేసే యోచన!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2026
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముందుగా కుదిరిన అధికార పంపిణీ ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడంతో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ నాయకత్వ మార్పుతో పాటు కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన చేపట్టాలని యోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, 'కేరళ మోడల్'ను అనుసరిస్తూ పలువురు సీనియర్ మంత్రులను పక్కనపెట్టి యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2023లో కుదిరిన ఒప్పందం మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలను గౌరవిస్తూ సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

యువతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్

ఇప్పుడు 64 ఏళ్ల డీకే శివకుమార్ త్వరలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో, కొత్త మంత్రివర్గ కూర్పుపై ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి కొత్త ఊపు తీసుకురావాలనే లక్ష్యంతో రాహుల్ గాంధీ సూచన మేరకు యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్షాళనలో భాగంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్‌సీ మహదేవప్ప (73), ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్ (76), హోంమంత్రి జీ పరమేశ్వర (74) వంటి సీనియర్ నేతలకు మంత్రి పదవుల నుంచి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

వివరాలు

కొత్త నేతలకు అవకాశం

వీరితో పాటు సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన బైరతి సురేశ్, సంతోష్ లాడ్, దినేశ్ గుండూరావు, బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్‌ల పేర్లను కూడా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత కేబినెట్‌లోని సుమారు 15 మంది మంత్రులను కొనసాగిస్తూ, మిగిలిన స్థానాల్లో డీకే శివకుమార్ సూచించిన కొత్త నేతలకు అవకాశం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాజకీయ మార్పులు కాంగ్రెస్ పార్టీలో మిశ్రమ స్పందనకు దారితీశాయి. ముఖ్యంగా సిద్ధరామయ్య మద్దతుదారులు, అహిందా వర్గాలకు చెందిన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

వివరాలు

భావోద్వేగానికి గురైన మంత్రులు

గురువారం సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన అల్పాహార సమావేశంలో తన నిర్ణయాన్ని వెల్లడించగానే పలువురు సహచర మంత్రులు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. అయితే పార్టీ ఐక్యత కోసం అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి సిద్ధరామయ్య చూపిన రాజకీయ పరిపక్వతపై కాంగ్రెస్ వర్గాల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మంత్రివర్గంపై తుది జాబితా ఖరారు కాలేదని, అనుభవం మరియు యువత కలయికతో కొత్త కేబినెట్‌ను రూపొందించే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం అనంతరం దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement