Congress Crowdfunding: 2024 సార్వత్రిక ఎన్నికల నిధులకోసం 'క్రౌడ్ ఫండింగ్'పై కాంగ్రెస్ ఫోకస్
2024 సార్వత్రిక ఎన్నికల ముగింట కాంగ్రెస్ పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ సవాళ్లలో నగదు కొరత ప్రధాన సమస్యల్లో ఒకటి. ఈ క్రమంలో నగదు సంక్షోభాన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ త్వరలో దేశవ్యాప్తంగా క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. నవంబర్‌లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో పోలింగ్ జరగనుంది, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటిస్తారు.
ఫండ్ ఉంటేనే.. 'ఇండియా' కూటమిపై ఆధిపత్యం
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ మరో 25 పార్టీలతో పొత్తు పెట్టుకొని 'ఇండియా' పేరుతో కూటమిని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కూటమిలోని అన్ని పార్టీలపై ఆధిపత్యం చేలాయించాలంటే.. పార్టీకి వద్ద భారీ స్థాయిలో ఫండ్స్ అవసరం అయితాయి. అవసరమైతే.. మిత్రపక్షాలకు కూడా ఫండింగ్ పరంగా కాంగ్రెస్ సాయం చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ దగ్గర అవసరమైన నిధులు లేవు. ఈ క్రమంలో అవసరమైన నిధుల కోసం పార్టీ క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని చేపట్టనుంది. అడ్వకేసీ గ్రూప్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక ప్రకారం, ప్రస్తుతం కాంగ్రెస్ ఆస్తుల విలువ రూ. 805.68కోట్లు కాగా.. భారతీయ జనతా పార్టీ ఆస్తుల విలువ రూ.6,046.81 కోట్లు.
గత ఏడేళ్లుగా కాంగ్రెస్‌కు భారీగా తగ్గిన కార్పొరేట్ విరాళాలు
గత 7 సంవత్సరాలుగా కాంగ్రెస్‌కు కార్పొరేట్ సంస్థల విరాళాలు తగ్గుతూ వస్తున్నాయి. కానీ బీజేపీకి మాత్రం కార్పొరేట్ విరాళాలు భారీగా పెరుగుతున్నాయి. గత 7 సంవత్సరాలలో బీజేపీ ప్రకటించిన కార్పొరేట్ విరాళాలు అన్ని ఇతర జాతీయ పార్టీల మొత్తం విరాళాల కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇతర జాతీయ పార్టీల కంటే బీజేపీ కార్పొరేట్ సంస్థల విరాళాలు 18రెట్లు అధికం కావడం గమనార్హం. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి కార్పొరేట్ సంస్థల విరాళాలు భారీగా వస్తుంటాయి. అందులో భాగంగానే బీజేపీకి వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఆప్ బాటలో కాంగ్రెస్
గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే తరహాలో ఆన్ లైన్ విరాళాలను సేకరించింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల వేళ.. కాంగ్రెస్ అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ తన కార్యాలయాలను నడపడానికి నిధులు లేకపోవటంతో 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. అలాగే 'లంచ్ విత్ సీఎం' కార్యక్రమాన్ని ఆప్ నిర్వహించింది. ఇందులో అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి లంచ్, డిన్నర్ చేసుకునే అవకాశం సామాన్యులకు లభించింది. ప్రతిఫలంగా వారు పార్టీ ఫండ్‌కు డబ్బు చెల్లించేవారు. నిధుల కొరతను తీర్చుకునేందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆప్ బాటలో పయనించేందుకు సిద్ధమైంది.