LOADING...
Siddaramaiah: సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటనలో సమయం ఇవ్వని కాంగ్రెస్ అధిష్ఠానం!
సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటనలో సమయం ఇవ్వని కాంగ్రెస్ అధిష్ఠానం!

Siddaramaiah: సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటనలో సమయం ఇవ్వని కాంగ్రెస్ అధిష్ఠానం!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2025
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో కొంతకాలంగా సీఎం మార్పు గురించి వివిధ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నవంబర్ నెలలో ఈ మార్పు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తరచూ బెంగళూరు-దిల్లీ ప్రయాణాలు చేస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర నాయకత్వంతో భేటీ కోసం సమయం కోరినా, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్న వార్తలు జాతీయ మీడియాలో వినిపిస్తున్నాయి.

వివరాలు 

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు

రాష్ట్రంలో వచ్చే నెల చివరి నాటికి రాజకీయ సమీకరణాల్లో పెద్ద మార్పులు చోటుచేసుకోవచ్చని అధికార పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంలో సిద్ధరామయ్య త్వరలో దిల్లీ పర్యటన చేసి,ఒక పుస్తక విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ సందర్బంగా కీలక నాయకులతో సమావేశం కోరినప్పటికీ,పార్టీ హైకమాండ్‌ ఈ భేటీ అవసరం లేదని స్పష్టంగా తెలియజేసిందనే సమాచారం బయటకు వచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు పూర్తి అవుతున్న సమయంలో ఈపరిణామాలు మరింత చర్చనీయాంశంగా మారాయి. అయినప్పటికీ సిద్ధరామయ్య మాత్రం తన ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ,"మరో రెండున్నరేళ్లు కూడా అధికారంలో కాంగ్రెస్‌నే ఉంటుంది.వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు మళ్లీ మా పార్టీకి మద్దతిస్తారని నాకు నమ్మకం"అని కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

వివరాలు 

'ఓటు కొనుగోలు' కేసు విషయంలో డీకే శివకుమార్‌ రాజధానిలో పలు సమావేశాలు

ఇదే సమయంలో సిద్ధరామయ్య శ్రేణికి చెందిన ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్‌ దిల్లీలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకు విందు ఏర్పాటు చేశారు. ఆయన సోదరుడు, ఎంపీ రాజశేఖర హిట్నాల్‌ నివాసంలో జరిగిన ఈ విందును సిద్ధూ పక్ష బలం ప్రదర్శనగా చూడాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వైపు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ గత వారం వ్యవధిలో రెండోసారి దిల్లీ ప్రయాణం చేశారు. 'ఓటు కొనుగోలు' కేసు విషయంలో ఆయన రాజధానిలో పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

వివరాలు 

బీహార్‌ ఎన్నికల ఫలితాల అనంతరం  విదేశాలకు రాహుల్‌ గాంధీ

ఇదిలా ఉండగా, ముందస్తుగా ఇచ్చిన మాట ప్రకారం ఏ సమయానైనా తమకు సీఎం పదవి దక్కొచ్చని డీకే శివకుమార్‌ నమ్ముతున్నారు. తొలివిడత కూర్పులో ముఖ్యమంత్రికి మద్దతుగా ఉన్న నాయకులకే మంత్రివర్గంలో చోటు లభించగా, ఈసారి తనకు అనుకూలంగా ఉన్న నాయకులకు కీలక పదవులు ఇవ్వాలని డీకే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బీహార్‌ ఎన్నికల ఫలితాల అనంతరం రాహుల్‌ గాంధీ విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. రాహుల్‌ గైర్హాజరీలో ముఖ్య నిర్ణయాలు తీయడం కష్టమవుతుందని భావించిన డీకే, మంత్రివర్గ జాబితాను హైకమాండ్‌కు ముందుగానే పంపాలని చూస్తున్నారని కూడా తెలుస్తోంది.