Congress: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమం: కాంగ్రెస్
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆలయ ప్రాణ ప్రతిష్ఠ నిర్వాహకుల ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది. ఈ మేరకు బుధవారం పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రామాలయ ప్రారంభోత్సవం బీజేపీ, దాని సైద్ధాంతిక సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) రాజకీయ కార్యక్రమమని, అందుకే పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నేతలు హాజరుకావడం లేదని ప్రకటనలో పేర్కొంది. రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం అందిన నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ ప్రకటన విడుదల చేశారు.
ఎన్నికల ప్రయోజనాల కోసమే సగం కట్టిన ఆలయాన్ని ప్రారంభిస్తున్నారు: కాంగ్రెస్
రాముడిని కోట్లాది మంది భారతీయులు ఆరాధిస్తారని, మతం అనేది మనిషి వ్యక్తిగత విషయమని, అయితే అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ కార్యక్రమంగా మార్చాయని కాంగ్రెస్ విమర్శించింది. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే సగం కట్టిన ఆలయాన్ని ప్రారంభిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. 2019లో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఆమోదిస్తూ, ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తూ.. ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తాము గౌరవపూర్వకంగా తిరస్కరిస్తున్నామని కాంగ్రెస్ వెల్లడించింది. అంతకుముందు, సీపీఎం నాయకులు ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయంలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.