panchayat elections: పంచాయతీ ఎన్నికల మూడో విడతలోనూ కాంగ్రెస్'దే పైచేయి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. తొలి రెండు విడతల్లోనే సుమారు 56 శాతం స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్... మూడో విడతలో కూడా అదే స్థాయి ఆధిక్యాన్ని కొనసాగించింది. బుధవారం జరిగిన మూడో విడత ఎన్నికల్లో మొత్తం 4,159 స్థానాలకు ఫలితాలు వెలువడగా, ఏకగ్రీవాలను కలుపుకొని రాత్రి 12.30 గంటల వరకు కాంగ్రెస్ మద్దతుదారులు 2,286 స్థానాల్లో విజయం సాధించారు. భారాస 1,142 స్థానాలు దక్కించుకోగా, భాజపా 242 చోట్ల గెలిచింది. ఇతరులు 479 స్థానాల్లో విజయం నమోదు చేశారు. వీటిలో సీపీఐ మద్దతుదారులు 24, సీపీఎం అభ్యర్థులు 7 చోట్ల గెలుపొందారు.
వివరాలు
కాంగ్రెస్ 7,010 స్థానాలు కైవసం
సిద్దిపేట జిల్లా తప్ప మిగిలిన 30 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో మొత్తం 12,733 గ్రామ పంచాయతీ సర్పంచి పదవులకు మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా, అందులో కాంగ్రెస్ 7,010 స్థానాలను కైవసం చేసుకుంది. భారాస 3,502 స్థానాల్లో గెలుపొందగా, భాజపా 688 చోట్ల విజయం సాధించింది. ఇతరులు 1,505 స్థానాలు దక్కించుకున్నారు. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాలు సాధించింది.
వివరాలు
రెండో విడతతో పోలిస్తే 0.9 శాతం తక్కువ పోలింగ్ నమోదు
ఎన్నికల రోజున ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో విడతలో 85.77 శాతం పోలింగ్ నమోదైంది. ఇది రెండో విడతతో పోలిస్తే 0.9 శాతం తక్కువగా ఉంది. మూడు విడతలను కలిపి మొత్తం 85.30 శాతం ఓటింగ్ జరిగింది. మూడో విడతలో యాదాద్రి భువనగిరి జిల్లా అత్యధికంగా 92.56 శాతం పోలింగ్‌తో ముందంజలో నిలిచింది. ఇక్కడ మహిళల పోలింగ్ శాతం 92.33 కాగా, పురుషుల పోలింగ్ 92.79 శాతంగా నమోదైంది. ఇక నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76.45 శాతం పోలింగ్ మాత్రమే జరిగింది. మూడో విడతలో మొత్తం 50,56,334 మంది ఓటర్లకు గాను 43,37,024 మంది (85.77 శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వివరాలు
చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతం
ఇందులో మహిళా ఓటర్ల పాల్గొనడం ఎక్కువగా నమోదైంది. మొత్తం 25,77,683 మహిళా ఓటర్లలో 85.96 శాతం అంటే 22,15,683 మంది ఓటేశారు. పురుష ఓటర్లు 24,78,519 మంది ఉండగా, వారిలో 21,21,269 మంది (85.59 శాతం) పోలింగ్‌లో పాల్గొన్నారు. ఇతర కేటగిరీలో ఉన్న 142 మందిలో 72 మంది (50.70 శాతం) ఓటు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. నిర్మల్ జిల్లా ముథోల్‌లో మొత్తం 10,232 మంది ఓటర్లు ఉండగా, మధ్యాహ్నం ఒంటి గంటలోపు వివిధ వార్డుల్లో సుమారు 500 మంది వరకు ఓటర్లు క్యూలలో నిలబడ్డారు.
వివరాలు
ప్రమాణ స్వీకారం 22న
అక్కడ మధ్యాహ్నం 2.30 గంటలకు పోలింగ్ ముగిసింది. మూడో విడత పోలింగ్ సరళిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించిన జిల్లా కలెక్టర్లు,అధికారులు,పోలింగ్ సిబ్బందిని సీఎస్ అభినందించారు. పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారని డీజీపీ తెలిపారు. గత నెల 25న ప్రారంభమైన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ బుధవారంతో పూర్తయింది. నూతనంగా ఎన్నికైన సర్పంచుల పదవీ ప్రమాణ స్వీకారాన్ని ఈ నెల 22న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.20న ముహూర్తం సరిగా లేదని కొత్తగా ఎన్నికైన సర్పంచులు,వార్డు సభ్యులు కోరడంతో ప్రభుత్వం తేదీని మార్చినట్లు తెలిపింది.