LOADING...
panchayat elections:రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం

panchayat elections:రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 15, 2025
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతు పొందిన అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేశారు. మొత్తం 4,333 స్థానాల్లో సగాని కంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కుమురం భీం ఆసిఫాబాద్‌, జనగామ, నిర్మల్‌ జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ బలపరిచినవారే ఎక్కువ స్థానాలను దక్కించుకున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి రెండో విడతలోనూ తీవ్ర పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానాన్ని దక్కించుకోగా, నిర్మల్‌ జిల్లాలో భాజపా మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందారు.

వివరాలు 

ఓటెత్తిన పల్లెలు 

అర్ధరాత్రి 12.30 గంటల వరకు వచ్చిన ఫలితాల ప్రకారం ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్‌కు 2,297స్థానాలు (51.9%),భారత రాష్ట్ర సమితికి 1,191(27.5%), భాజపాకు 257(6.2%),ఇతరులకు 578 (14.4%)వచ్చాయి. ఇతరుల్లో సీపీఎం మద్దతుదారులు 33చోట్ల,సీపీఐ బలపరిచినవారు 28చోట్ల గెలిచారు. ఇదే సమయంలో మొదటి విడతలో కాంగ్రెస్‌ మద్దతుదారులు 2,425, భారత రాష్ట్ర సమితి 1,168, భాజపా 189, ఇతరులు 448 స్థానాల్లో విజయం సాధించారు. తీవ్ర చలి ఉన్నప్పటికీ గ్రామీణ ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌కు తరలివచ్చారు. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలు కనిపించాయి. రెండో విడతలో 85.86 శాతం పోలింగ్‌ నమోదు కాగా,ఈ నెల 11న జరిగిన మొదటి విడతలో నమోదైన 84.28 శాతంతో పోలిస్తే ఇది 1.58 శాతం అధికం.

వివరాలు 

బరిలో మొత్తం 12,782మంది సర్పంచి అభ్యర్థులు,71,071 మంది వార్డు సభ్యులు

ఆదివారం సెలవుదినం కావడంతో పోలింగ్‌ శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. రెండో దశలో 4,333 గ్రామ పంచాయతీ సర్పంచి, 38,350 వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వీటిలో 415 సర్పంచి, 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మంచిర్యాల,వరంగల్‌ జిల్లాల్లో ఒక్కొక్క గ్రామంలో,నల్గొండ జిల్లాలో మూడు గ్రామాల్లో, అలాగే 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో రెండు గ్రామాల్లో,18 వార్డుల్లో ఎన్నికలు నిలిపివేశారు. ఆదివారం 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీల సర్పంచి, 29,917వార్డు సభ్యుల పదవులకు పోలింగ్‌ జరిగింది. మొత్తం 12,782మంది సర్పంచి అభ్యర్థులు,71,071 మంది వార్డు సభ్యులు బరిలో నిలిచారు. మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోనూ యాదాద్రి భువనగిరి జిల్లా అత్యధికంగా 91.72శాతం పోలింగ్‌తో ముందంజలో నిలిచింది.

Advertisement

వివరాలు 

అధికంగా పాల్గొన్న మహిళలు 

నిజామాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా 76.71 శాతం పోలింగ్‌ నమోదైంది. 29 జిల్లాల్లో 80శాతానికి మించిన పోలింగ్‌ నమోదుకాగా, మొత్తం 54,40,339మంది ఓటర్లలో 46,70,972 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో మహిళల పాల్గొనడం అధికంగా కనిపించింది. 27,82,494మంది మహిళా ఓటర్లలో 23,93,010 మంది ఓటు వేయగా, 26,57,702 మంది పురుష ఓటర్లలో 22,77,902మంది పాల్గొన్నారు. ఇతర విభాగంలో 143మందికి గాను 60 మంది ఓటు వేశారు. చెదురుమదురు ఘటనలు తప్ప రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్‌ ముగియగా, 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Advertisement

వివరాలు 

27 జిల్లాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం 

హోరాహోరీ పోటీ కారణంగా అనేక చోట్ల ఉత్కంఠభరితంగా లెక్కింపు సాగింది. చాలా చోట్ల స్వల్ప మెజారిటీలతోనే విజేతలు తేలారు. ఆదివారం రాత్రి ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచి ఎన్నికలను నిర్వహించి, వార్డు సభ్యుల సమావేశంలో ఉపసర్పంచులను ఎన్నుకున్నారు. నల్గొండ, ఖమ్మం, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్‌, సూర్యాపేట, నిజామాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మెదక్‌, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, గద్వాల, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్‌, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి, రంగారెడ్డి, హనుమకొండ, కరీంనగర్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు మెజారిటీ స్థానాలు గెలుచుకున్నారు.

వివరాలు 

మూడు జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ ముందంజ 

సిద్దిపేట, కుమురం భీం ఆసిఫాబాద్‌, జనగామ జిల్లాల్లో భారత రాష్ట్ర సమితి మద్దతుదారులు ఆధిక్యంలో నిలిచారు. ఒక జిల్లాలో భాజపా నిర్మల్‌ జిల్లాలో భాజపా మద్దతుదారులు ఎక్కువ స్థానాలు సాధించగా, ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ తరువాతి స్థానంలో నిలిచారు.

Advertisement