Page Loader
Nitin Gadkari: ఏపీలో జాతీయ రహదారులపై రూ.1,046 కోట్ల నిధులతో 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు: నితిన్‌ గడ్కరీ
ఏపీలో జాతీయ రహదారులపై రూ.1,046 కోట్ల నిధులతో 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు: నితిన్‌ గడ్కరీ

Nitin Gadkari: ఏపీలో జాతీయ రహదారులపై రూ.1,046 కోట్ల నిధులతో 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు: నితిన్‌ గడ్కరీ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 06, 2024
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారులపై రూ.1,046 కోట్ల నిధులతో చేపట్టిన 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. లోక్‌సభలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా గడ్కరీ వివరించారు. ఎన్‌హెచ్‌-216ఎపై మోరంపూడి, జొన్నాడ, ఉండ్రాజవరం జంక్షన్,తేతలి, కైకరం వద్ద నిర్మాణంలో ఉన్న ఐదు వంతెనలను 2025 ఏప్రిల్ 2నాటికి పూర్తవుతాయి. అలాగే, ఎన్‌హెచ్‌-16పై గొలగమూడి జంక్షన్, నెల్లూరు టీ జంక్షన్‌ల వద్ద నిర్మిస్తున్న రెండు వంతెనలను 2025 సెప్టెంబర్ 11కు,విశాఖపట్నం ఎయిర్‌పోర్టు జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ను 2025 ఫిబ్రవరి 15లోపు, గుంటూరు మిర్చియార్డు వద్ద నిర్మిస్తున్న వంతెనను 2025 జనవరి 6 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.

వివరాలు 

ఫ్లైఓవర్ల నిర్మాణాలకు బిడ్లు

ఈ నేపథ్యంలో, ఎన్‌హెచ్‌-16పై నాగులుప్పలపాడు గ్రోత్‌సెంటర్, రాజుపాలెం జంక్షన్ వద్ద వంతెనల నిర్మాణానికి అనుమతులు జారీ చేసినట్లు తెలిపారు. అదే హైవేలో రాజుపాలెం క్రాస్‌రోడ్డు, జొన్నతాళి క్రాస్‌రోడ్డు, చెవ్వూరు క్రాస్‌రోడ్డు, రణస్థలం టౌన్ పోర్షన్‌తో పాటు ఎన్‌హెచ్‌-44పై కియా వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణాలకు బిడ్లు ఆహ్వానించామని చెప్పారు. అలాగే, ఎన్‌హెచ్‌-16లో శ్రీసిటీ జీరో పాయింట్, చిల్లకూరు సెంటర్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణాలకు బిడ్లు ఇంకా పిలవాల్సి ఉందని గడ్కరీ వివరించారు.