LOADING...
Amaravati: కృష్ణా పశ్చిమ డెల్టా కాలువపై స్టీల్‌ వంతెన నిర్మాణం.. మూడు నెలల్లో పూర్తి చేయాలని సంకల్పం
మూడు నెలల్లో పూర్తి చేయాలని సంకల్పం

Amaravati: కృష్ణా పశ్చిమ డెల్టా కాలువపై స్టీల్‌ వంతెన నిర్మాణం.. మూడు నెలల్లో పూర్తి చేయాలని సంకల్పం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2025
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతి రాజధాని దిశగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ-3 రోడ్డును పాత జాతీయ రహదారితో కలిపేందుకు, కేఎల్‌ రావు కాలనీ సమీపంలో కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై స్టీల్‌ వంతెన నిర్మాణం చేపట్టింది అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏడీసీఎల్‌). సుమారు రూ.70 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. డెల్టా కాలువపై 128 మీటర్ల పొడవుతో, నాలుగు లైన్లుగా నిర్మించనున్న ఈ స్టీల్‌ వంతెన ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి సెంటర్‌కు వెళ్లే మార్గంలో కేఎల్‌ రావు కాలనీ వద్ద ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉంటుంది. మూడు నెలల్లో ఈ నిర్మాణ పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇంజినీరింగ్‌ విభాగం చర్యలు తీసుకుంటోంది.

వివరాలు 

మరో పైవంతెన సన్నాహం.. 

ఈ వంతెన నిర్మాణం పూర్తయితే, అమరావతికి వెళ్లే వాహనాలు ఇకపై కృష్ణా కరకట్ట మార్గం మీదుగా కాకుండా నేరుగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డునుంచి వంతెన మీదుగా వెళ్లే సౌకర్యం లభిస్తుంది. దీనికి సంబంధించి పీడబ్ల్యూడీ వర్క్‌షాప్‌ వద్ద పిల్లర్‌ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కేఎల్‌ రావు కాలనీ నుంచి ఉండవల్లి సెంటర్‌ వరకు సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును 16వ నంబర్‌ జాతీయ రహదారితో కలిపేందుకు మరో పైవంతెన నిర్మించాలని ఏడీసీఎల్‌ ప్రణాళిక సిద్ధం చేసింది. కేఎల్‌ రావు కాలనీ నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో చెన్నై-కలకత్తా రైలు మార్గం,డెల్టా కాలువ ఉండటంతో వీటిపై నుంచి వంతెన నిర్మించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనను సిద్ధం చేసి, త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

వివరాలు 

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పనుల్లో వేగం 

అమరావతి రాజధాని దిశగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పనులు క్రమంగా పూర్తి దిశగా పయనిస్తున్నాయి. పెనుమాక, ఉండవల్లి ప్రాంతాల రైతులు రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూములను స్వచ్ఛందంగా అందజేయడంతో పనులు వేగం పుంజుకున్నాయి. ఇటీవల ఉండవల్లి పరిధిలో 12.40 ఎకరాల భూమిని రైతులు అధికారులకు అంగీకార పత్రాలతో అందించారు. మరో 5.6 ఎకరాల భూమి సమీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. రోడ్డు పనులు పూర్తయిన తర్వాత ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతి రాజధానికి వెళ్లేవారికి కొత్త స్టీల్‌ వంతెన ద్వారా నేరుగా చేరుకునే సౌకర్యం లభించనుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే, రాజధానికి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.