LOADING...
Tirumala Tirupati Board: మరోసారి వివాదంలో తిరుమల.. పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల పాలిస్టర్ సరఫరా కుంభకోణం వెలుగులోకి..
తిరుమలలో పట్టు వస్త్రాల పేరుతో కుంభకోణం

Tirumala Tirupati Board: మరోసారి వివాదంలో తిరుమల.. పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల పాలిస్టర్ సరఫరా కుంభకోణం వెలుగులోకి..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2025
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో అత్యంత సంపన్నమైన దేవాలయ సంస్థల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం మళ్లీ వివాదాల్లో చిక్కుకుంది. తాజా ఆరోపణల ప్రకారం.. దాతలు,వేద ఆశీర్వచనంలో పాల్గొనే భక్తులు, ముఖ్య అతిథులకు ప్రత్యేక దర్శనం సందర్భంగా అందించే 'పట్టు సరిగ దుప్పట్టా'(ఉత్తరీయాలు) కొనుగోలులో దశాబ్ద కాలంగా భారీ మోసం జరిగినట్లు టీటీడీ పాలక మండలి గుర్తించింది. టీటీడీలో జరిగిన అంతర్గత విజిలెన్స్ విచారణలో, 2015 నుంచి 2025 వరకూ సరఫరాదారులు పట్టు పేరుతో చౌకైన పాలిస్టర్ దుపట్టాలను సరఫరా చేసి, ట్రస్టుకు రూ. 55 కోట్లకు పైగా నష్టాన్ని కలిగించారని విచారణలో గుర్తించారు.

విచారణ

టీటీడీ బోర్డు ఛైర్మన్ బి.ఆర్. నాయుడు ఆదేశాల మేరకు విజిలెన్స్ విచారణ

ఈ విచారణ టీటీడీ బోర్డు ఛైర్మన్ బి.ఆర్. నాయుడు ఆదేశాల మేరకు విజిలెన్స్ విచారణ ప్రారంభించింది. పూజా కార్యక్రమాల్లో, ముఖ్యంగా వేదాశీర్వచన కార్యక్రమాల్లో ఉపయోగించే ఈ దుపట్టాలను, పెద్ద మొత్తాల్లో విరాళాలు ఇచ్చే దాతలకు బహుమతిగా ఇస్తారు. కానీ అసలు రూ.350కి అందే పాలిస్టర్ దుపట్టాలను రూ.1300గా బిల్లు పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. "గత పదేళ్లలో రూ.50 కోట్లకు పైగా సరఫరాలు జరిగాయి. దీనిపై అవినీతి నిరోదక బ్యూరోతో సమగ్రంగా విచారణ చేయమని ఆదేశించాం," అని బి.ఆర్. నాయుడు తెలిపారు.

 ట్రస్ట్ 

టీటీడీ ట్రస్ట్ గురించి

టీటీడీ, 1987 చట్టంలోని షెడ్యూల్-1 ప్రకారం క్రియాశీలకంగా పనిచేసే ఆలయాల సమూహం. ప్రభుత్వమే ట్రస్టు బోర్డును నియమిస్తుంది. టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రధాన అధికారి. ఆయనకు ఇద్దరు జాయింట్ ఈఓలు, విజిలెన్స్ & సెక్యూరిటీ అధికారి, ఫారెస్ట్ కన్జర్వేటర్, ఫైనాన్షియల్ అడ్వైజర్, చీఫ్ అకౌంట్స్ అధికారి, చీఫ్ ఇంజనీర్ వంటి అధికారులు సహకరిస్తారు. టీటీడీ పరిధిలో 12 ప్రధాన ఆలయాలు, వాటి ఉపాలయాలు ఉన్నాయి. మొత్తం 14,000 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా బి.ఆర్. నాయుడు ఉన్నారు.

Advertisement

 ఆస్తులు 

టీటీడీ ఆస్తులు - విలువ ఎంత?

తాజా గణాంకాల ప్రకారం టీటీడీ నికర ఆస్తుల విలువ సుమారు రూ.3 లక్షల కోట్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆస్తులు ఉన్న ధార్మిక సంస్థల్లో ఒకటి. నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం, దేశవ్యాప్తంగా ఉన్న 960కి పైగా ఆస్తులు.. ఇవన్నీ టీటీడీ ధనసంపద. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఇచ్చే హుండీ నిధులు, విరాళాలు దీని ప్రధాన ఆదాయం.

Advertisement

వివరాలు 

నిబంధలన ఉల్లంఘన..  

దాతలు, అధికారులు, వేదాశీర్వచనంలో పాల్గొనే వారికి ప్రత్యేక సందర్భాల్లో ఇచ్చే ఈ పట్టు దుపట్టాలకు టీటీడీ స్పష్టమైన టెక్నికల్ నిబంధనలు పెట్టింది.. దుపట్టా పూర్తిగా స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో నేయబడి ఉండాలి. తప్పనిసరిగా సిల్క్ మార్క్ (Silk Mark) హలోగ్రామ్ కలిగి ఉండాలి. ఒక మీటరు వెడల్పు, 2.3 మీటర్ల పొడవు ఉన్న ఈ దుపట్టాపై "ఓం నమో వెంకటేశాయ" అనే తెలుగు, సంస్కృత లిపిలో శంకు, చక్రం, నామం చిహ్నాలు మధ్యలో ముద్రించి ఉండాలి. ఒక్కో దుపట్టా కనీసం 180 గ్రాములు బరువు కలిగి ఉండాలి.

వివరాలు 

పూర్తి నివేదికను బోర్డుకు సమర్పించిన విజిలెన్స్

టీటీడీ బోర్డు ఛైర్మన్ బి.ఆర్. నాయుడు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు తిరుపతి గోదాంలలోని స్టాక్, తిరుమలలోని వైభవోత్సవ మండపంలోని స్టాక్‌ల నుంచి నమూనాలను సేకరించారు. ధర్మవరంలో, బెంగళూరులోని కేంద్ర పట్టు బోర్డు (Central Silk Board) సహా ఇతర ల్యాబ్‌లలో నిర్వహించిన పరీక్షల్లో ఆ దుపట్టాలు పూర్తిగా పాలిస్టర్‌తో తయారు చేసినవని, తప్పనిసరి అయిన సిల్క్ మార్క్ లేదని తేలింది. నవంబరులో విజిలెన్స్ విభాగం పూర్తి నివేదికను బోర్డుకు సమర్పించింది. దీంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

Advertisement