AP SSC Exams 2026 : ఏపీ టెన్త్ స్పాట్ వాల్యుయేషన్‌పై వివాదం.. ఉపాధ్యాయ సమాఖ్య కీలక డిమాండ్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీన్ అన్సారీని కలిసి స్పాట్ వాల్యుయేషన్ విధులపై తలెత్తిన సమస్యలను వివరించింది. నిబంధనల ప్రకారం 60 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులకు 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ విధుల నుండి మినహాయింపు ఇవ్వాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో ఆ నియమాలను పట్టించుకోకుండా వారికే విధులు అప్పగిస్తున్నారని సమాఖ్య ఆరోపించింది. ఇక 10వ తరగతికి బోధించని ఉపాధ్యాయులను కూడా స్పాట్ వాల్యుయేషన్‌కు నియమిస్తున్నారని ఏపీటీఎఫ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉపాధ్యాయులు, అలాగే జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్న మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఈ విధుల నుండి మినహాయించాలని డిమాండ్ చేశారు.
వివరాలు
ఏప్రిల్ 6వ తేదీ నుండి మూల్యాంకనం ప్రారంభం
అన్నమయ్య జిల్లా నుండి తిరుపతిలో విలీనం అయిన మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు కూడా స్పాట్ విధుల నుండి మినహాయింపు కల్పించాలని సమాఖ్య నాయకులు కోరారు. ఉపాధ్యాయ సంఘాలతో సమీక్ష నిర్వహించి, సిలబస్‌లో ఉన్న అశాస్త్రీయ అంశాలను తొలగించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీ టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 6వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 15వ తేదీ నాటికి అన్ని సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం స్పాట్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
వివరాలు
ఏప్రిల్ చివర్లో ఫలితాలు విడుదల
గతేడాది టెన్త్ మార్కుల కౌంటింగ్‌లో చోటుచేసుకున్న తప్పిదాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది తప్పులు చేసిన సిబ్బందిపై జరిమానాలు విధించేలా కొత్త నిబంధనలు అమలు చేయనుంది. అదేవిధంగా ఈసారి ట్యాబ్‌ల ద్వారా మార్కులను నమోదు చేయనున్నారు. ఏప్రిల్ 1వ తేదీతో టెన్త్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈసారి మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6,22,074 మంది రెగ్యులర్ అభ్యర్థులు కాగా, 18,842 మంది ప్రైవేట్ అభ్యర్థులు ఉన్నారు. అలాగే 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు పరీక్షలు రాశారు. ఫలితాలను ఏప్రిల్ మూడో లేదా నాల్గో వారంలో విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.