
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. గత 24గంటల్లో దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 7,026కి పెరిగింది.
కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా కేసుల పెరుగుదల, ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది.
దేశంలో కరోనా మరో ఐదుగురు మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 5,30,813కి చేరుకుంది. ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒకరు చొప్పున మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.09 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ
క్రమంగా కోవిడ్ కేసుల పెరుగుదలను నమోదు చేస్తున్న ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత వారం లేఖ రాసింది. వైరస్ వ్యాప్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలో పేర్కొన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు రాజేష్ భూషణ్ లేఖ రాశారు.
కరోనాతోపాటు హెచ్3ఎన్2 వైరస్‌ల వ్యాప్తిని నియంత్రించడానికి ఆయా రాష్ట్రాలు క్షేతస్థాయిలో పరిశీలించాలని సూచించారు.
కేసులు మరీ ఎక్కువగా పెరిగితే, అవరసమైతే ముందస్తు చర్యలు తీసుకోవాలని భూషణ్ అన్నారు.