ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు
దిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వేల సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. దీంతో అలర్ట్ అయిన దిల్లీ పోలీసులు వాటిని తొలగించే పనిలో పడ్డారు. ఈ వ్యవహారంలో 44 కేసులు నమోదు చేసిన పోలీసులు, నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరికి ప్రింటింగ్ ప్రెస్ ఉంది. దిల్లీ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 2,000 పోస్టర్లను పోలీసులు తొలగించినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్లలో 'మోదీ హటావో, దేశ్ బచావో' అనే నినాదం ఉంది. ప్రింటింగ్ ప్రెస్ పేరుతో పోస్టర్లు ముద్రించాలనే చట్టం ప్రకారం వారిని అరెస్టు చేసినట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆప్ కార్యాలయానికి వెళ్తున్న 2,000 పోస్టర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయానికి డెలివరీ అవుతున్నట్లు చెబుతున్న 2,000 పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని ఐపీ ఎస్టేట్ ప్రాంతంలో ఓ వ్యాన్‌ను అడ్డగించిన పోలీసులు పోస్టర్లను గుర్తించారు. పోస్టర్లను ఆప్ ప్రధాన కార్యాలయానికి అందజేయాలని సూచించినట్లు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. 50,000 'మోదీ హఠావో, దేశ్ బచావో' పోస్టర్లను ముద్రించాలని తమకు ఆర్డర్ వచ్చిందని అరెస్టయిన ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఢిల్లీ పోలీసులకు తెలిపారు. పోస్టర్లలో ప్రింటింగ్ ప్రెస్ పేరు లేకపోవడంతో యజమానులను అరెస్టు చేశారు. పోస్టర్లలో అభ్యంతరం ఏముందని ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్‌లో ప్రశ్నించింది. ఇది మోదీ ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట అని ఆ పార్టీ పేర్కొంది.