దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను మంగళవారం అధికారులు విచారిస్తున్నారు. మూడో దఫా విచారణలో భాగంగా కవిత ఇప్పటి వరకు తాను ఉపయోగించిన అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించారు. ఈడీ కార్యాలయానికి మంగళవారం వెళ్లే ముందే వీడియాకు ఫోన్లను కవిత చూపించారు. అనంతరం ఈడీ అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులకు కవిత ఒక లేఖను కూడా సమర్పించారు. ఈ ఫోన్‌లు తన హక్కని, పక్షపాతం లేకుండా సమర్పించినట్లు కవిత లేఖలో పేర్కొన్నారు. ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం అంటే ఆమే గోప్యతా హక్కులకు భంగం కలిగించడం కాదా అని ప్రశ్నించారు.
నన్ను అడగకుండానే ఈడీ అధికారులు ఎందుకు ఆరోపణలు చేశారు: కవిత
తాను ఫోన్లను ధ్వంసం చేసినట్లు దర్యాప్తు సంస్థ తెలిపిందని, కనీసం తనను అడగకుండా ఈడీ ఎందుకు ఈ ఆరోపణలు చేసినట్లు కవిత ప్రశ్నించారు. ఈడీ తనను తొలిసారిగా మార్చిలో విచారణకు పిలిచిందని, కానీ గతేడాది నవంబర్‌లోనే ఫోన్లు ధ్వంసం చేసినట్లు ఆరోపించడంలో దురుద్దేశం లేదా అని అడిగారు. మార్చి 11, మార్చి 20తేదీల్లో దిల్లీలోని ప్రధాన కార్యాలయాల్లో ఈడీ విచారించింది. దీంతో రెండు రోజులు కలిపి కవితను ఈడీ సుమారు 18-19 గంటలు పాటు విచారించింది. మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితను ఈడీ విచారిస్తోంది.