దిల్లీ మద్యం కేసు: నేడు మరోసారి ఈడీ ముందుకు కవిత; అరెస్టుపై ఊహాగానాలు
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మంగళవారం మూడోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారు. ఈ క్రమంలో అమె అరెస్టుపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈడీ సోమవారం సుదీర్ఘంగా 10 గంటలకు కవితను విచారించింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 9.15 గంటలకు ముగిసింది. ఈ క్రమంలో కవితకు ఈడీ మరోసారి సమన్లు పంపింది. మళ్లీ మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.
పిళ్లై, కవితను కలిపి ఐదు గంటలపాటు ఈడీ విచారణ
మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితను ఈడీ విచారిస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై.. తాను కవిత బినామీ అని వాంగ్మూలంలో చెప్పారు. ఆమె చెప్పినందు వల్లే తన ఖాతాలోకి 32కోట్లు వచ్చాయని పేర్కొన్నారు. కోటి రూపాయలు కూడా తన ఖాతాలోకి వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం పిళ్లై, కవితలను కలిపి ఈడీ ఐదు గంటలపాటు విచారించింది. అనంతరం ఈడీ అధికారులు పిళ్లైని కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలో దిల్లీ కోర్టు పిళ్లైకు ఏప్రిల్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌లో విధించింది.