దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని మరో 5 రోజులు పొడిగించిన కోర్టు
మద్యం పాలసీ కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని మరో 5రోజులు పొడిగిస్తున్నట్లు రూస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. సిసోడియా ఏడు రోజుల ఈడీ రిమాండ్ శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో రూస్ అవెన్యూ కోర్టులో సిసోడియాను ఈడీ హాజరుపర్చింది. సిసోడియా ఫోన్లు ఎందుకు మార్చారనే తమ ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. మనీష్ సిసోడియాను మరో ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. తన ఫోన్ ఎక్కడ ఉందో సిసోడియా చెప్పలేకపోయారని, తమ రిమాండ్‌లో సీబీఐ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించిందని ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో రిమాండ్ పొడిగించాలన్న విజ్ఞప్తిని సిసోడియా తరపు న్యాయవాది వ్యతిరేకించారు.
అప్పుడు సీబీఐ చేసిందే, ఇప్పుడు ఈడీ చేస్తోంది: సిసోడియా తరఫు న్యాయవాది
సిసోడియా కంప్యూటర్‌ను గతంలో ఒక ఏజెన్సీ(సీబీఐ) స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేసిందని సిసోడియా తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇప్పుడు మరో ఏజెన్సీ(ఈడీ) మొత్తం ప్రక్రియను మళ్లీ పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. నేర జరిగిన విషయాన్నే కాకుండా, దాని వల్ల వచ్చిన ఆదాయాన్ని కూడా చూపించాల్సిన బాధ్యత ఈడీపై ఉందని న్యాయవాది కోర్టు విన్నవించారు. సీబీఐ ఏడు నెలలు విచారణ చేసి, సిసోడియా రిమాండ్‌ను పొడిగించాలని అడిగితే కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా సిసోడియా తరపు న్యాయవాది గుర్తు చేశారు. ఇప్పుడు ఈడీ కూడా అలాగే వ్యవహరిస్తోందని చెప్పారు. సీబీఐకి ప్రతినిధిగా ఈడీ వ్యవహరిస్తోందని న్యాయవాది వాదించారు.