Narendra Modi:ఎల్డీఎఫ్ సర్కారుకు కౌంట్‌డౌన్ స్టార్ట్.. నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) త్వరలోనే రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. శనివారం పథనంథిట్ట జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. వామపక్ష పాలనకు ముగింపు పలకాలన్న భావన రాష్ట్ర ప్రజల్లో బలంగా ఉన్నట్లు పార్టీ కార్యకర్తలు తనకు తెలియజేస్తున్నారని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవ జనాభా అధికంగా ఉన్న ఆరు రాష్ట్రాలతో పాటు గోవాలో బీజేపీ అధికారంలోకి వచ్చి అభివృద్ధి సాధించిందని పేర్కొన్న ఆయన, కేరళలో కూడా అదే తరహా అభివృద్ధిని సాధించగలమని తెలిపారు. అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నప్పటికీ, కేరళ ఇతర రాష్ట్రాల కంటే వెనుకబడి ఉందన్నారు.
వివరాలు
కేరళ సోదర సోదరీమణుల భద్రత నాకు ముఖ్యం
శబరి రైల్వే ప్రాజెక్టు ఆలస్యంపై స్పందించిన ప్రధాని, వామపక్ష ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తిరువాల్లా ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ఎన్నికలు వస్తాయి, పోతాయి. కానీ గల్ఫ్ దేశాల్లో ఉన్న కేరళ సోదర సోదరీమణుల భద్రత నాకు అత్యంత ముఖ్యమైనదని అన్నారు. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ రెండూ ఒకదానిని మరొకటి బీజేపీ 'బి' టీమ్‌గా విమర్శిస్తున్నాయని, అసలు కేరళలో బీజేపీనే 'ఎ' టీమ్ అని ఆ రెండు కూటములకు తెలుసని చమత్కరించారు. శబరిమల యాత్రను అపఖ్యాతిపాలు చేయడానికి ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లు ప్రయత్నించాయని ఆరోపిస్తూ, ఆలయాన్ని తమ దోపిడీకి కేంద్రంగా మార్చుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్‌డీఏ అధికారంలోకి వస్తే శబరిమల వ్యవహారంలో జరిగిన అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వివరాలు
దక్షిణాదిలో లోక్‌సభ స్థానాలపై స్పష్టత
దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ స్థానాలు తగ్గవన్న ప్రచారాన్ని ప్రధాని ఖండించారు. జనాభా నియంత్రణ కారణంగా ఓటర్ల సంఖ్య తగ్గినా, దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధిత్వం తగ్గబోదని హామీ ఇచ్చారు. అలాగే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా ఈ నెల 16న పార్లమెంట్ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
వివరాలు
తిరువనంతపురంలో మోదీ రోడ్‌షోకు భారీ స్పందన
కేరళ రాజధాని తిరువనంతపురంలో ప్రధాని నిర్వహించిన రోడ్‌షోకు విశేష స్పందన లభించింది. కిల్లిపాలం నుంచి ప్రారంభమైన ఈ రోడ్‌షో సుమారు 1.5 కిలోమీటర్ల మేర కొనసాగింది. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు రహదారి ఇరువైపులా నిలబడి భాజపా జెండాలు ఊపుతూ ప్రధానికి ఘన స్వాగతం పలికారు.