
Vice President: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కౌంట్‌డౌన్.. ఎన్డీఏ-ఇండియా కూటమి మధ్య హోరాహోరీ!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నెల 9న (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.
Details
ఇక ఈ ఎన్నికలో గమనించాల్సిన 5 ముఖ్యాంశాలు ఇవి:
1. ఎన్నికల విధానం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులే ఓటు వేస్తారు. ఎలక్టోరల్ కాలేజీలో 233 మంది రాజ్యసభ సభ్యులు (ఇందులో ఐదు సీట్లు ఖాళీగా ఉన్నాయి), 12 మంది నామినేటెడ్ సభ్యులు, 543 మంది లోక్‌సభ సభ్యులు (ఒక సీటు ఖాళీగా ఉంది) ఉంటారు. మొత్తంగా 786 ఓటర్లు ఉంటారు. గెలుపు సాధించడానికి 394 ఓట్లు అవసరం.
Details
2. సంఖ్యాబలం ఎవరికీ అనుకూలం?
ప్రస్తుతం సంఖ్యాబలం అధికార ఎన్డీఏ కూటమి వైపు ఉంది. లోక్‌సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల మద్దతు, రాజ్యసభలో 129 మంది మద్దతు ఉంది. దీంతో ఉభయ సభల్లో కలిపి 422 ఓట్లు ఎన్డీఏకు అనుకూలంగా ఉండడం వల్ల సీపీ రాధాకృష్ణన్ విజయావకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షానికి చెందిన బీఆర్‌ఎస్, బీజేడీ పార్టీలు ఎన్నికలకు దూరంగా నిలిచాయి. 3. ఎన్నికలు ఎందుకు వచ్చాయి? జగ్‌దీప్ ధన్‌కర్ జులై 21న ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం రాజీనామా సమర్పించారు. 2022 నుంచి ఉపరాష్ట్రపతిగా, అంతకు ముందు 2019 నుంచి 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు.
Details
4. ఎన్డీఏ అభ్యర్థి
ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ **సీపీ రాధాకృష్ణన్**ను ఎంపిక చేసింది. గౌండర్-కొంగు వెల్లాలర్ వర్గానికి చెందిన ఓబీసీ నాయకుడు. 68 ఏళ్ల రాధాకృష్ణన్ బీజేపీలో ఆర్ఎస్‌ఎస్ సిద్ధాంతాలను అనుసరించే మృదుభాషి, వివాదరహిత నేతగా గుర్తింపు పొందారు. తమిళనాడు నుంచి రెండుసార్లు (1998, 1999) లోక్‌సభకు ఎన్నికైన ఏకైక బీజేపీ నాయకుడు కూడా. 2024 జులై 31 నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.
Details
5. ఇండియా కూటమి అభ్యర్థి
ఎన్డీఏ అభ్యర్థికి పోటీగా ప్రతిపక్ష ఇండియా కూటమి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపింది. 79 ఏళ్ల సుదర్శన్ రెడ్డి 2011 జులైలో పదవీ విరమణ చేశారు. నల్లధనం కేసుల్లో అప్పటి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై కఠిన వ్యాఖ్యలతో పాటు పలు తీర్పులు ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన సల్వా జుడుమ్ బృందాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన తీర్పు కూడా ఆయనదే. ఈ ఎన్నికలో ఫలితం సంఖ్యాబలంపై ఆధారపడుతుండగా, ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయావకాశాలు దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.