Loading...
AP Election Counting: ఏపీలో పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌.. రాత్రి 8 గంటల్లోపు ఫలితాలు ప్రకటించాలి
ఏపీలో పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌.. రాత్రి 8 గంటల్లోపు ఫలితాలు ప్రకటించాలి

AP Election Counting: ఏపీలో పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌.. రాత్రి 8 గంటల్లోపు ఫలితాలు ప్రకటించాలి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 07, 2026
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మార్గదర్శకాలను జారీ చేసింది. శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించి, రాత్రి 8 గంటల్లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది. పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లాల్లో చేపట్టిన ఏర్పాట్లపై ఎస్‌ఈసీ పునేఠా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గతంలో వర్షాల కారణంగా మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపులో జాప్యం జరిగిందని పలువురు అధికారులు గుర్తుచేశారు. అయితే పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. కౌంటింగ్‌ ప్రారంభమైన తర్వాత 12 గంటల్లోపు ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించాలని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.

వివరాలు

పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇలా..

శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను లెక్కిస్తారు. ఆ తర్వాత పోలింగ్‌లో నమోదైన ఓట్ల లెక్కింపు చేపడతారు.

ప్రతి బ్యాలెట్‌ బాక్సులోని ఓట్లను బయటకు తీసి గులాబీ రంగులో ఉన్న ఎంపీటీసీ బ్యాలెట్‌ పత్రాలను, తెలుపు రంగులో ఉన్న జడ్పీటీసీ బ్యాలెట్‌ పత్రాలను వేర్వేరుగా విభజిస్తారు.

ఒకఎంపీటీసీ పరిధిలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్‌ పత్రాలను ఒకచోట చేర్చి, వాటి మడతలు విప్పకుండానే 25 పత్రాల చొప్పున కట్టలు కడతారు.

జడ్పీటీసీ బ్యాలెట్‌ పత్రాలను కూడా ఇదే విధానంలో 25 చొప్పున కట్టలుగా తయారు చేస్తారు. అనంతరం వాటిని రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ వద్ద ఏర్పాటు చేసిన పెద్ద డ్రమ్ములో వేసి కలుపుతారు.

వివరాలు

ఒక్కో టేబుల్‌పై 1,000 బ్యాలెట్‌ పత్రాలు

ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన మొత్తం టేబుళ్లలో 50 శాతం జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు, మిగిలిన 50 శాతం ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు కేటాయిస్తారు.

ప్రతి టేబుల్‌కు ఒక్కో విడతలో 25 బ్యాలెట్‌ పత్రాల చొప్పున 40 కట్టలను అందజేస్తారు. ఇలా ఒక్కో టేబుల్‌పై మొత్తం 1,000 బ్యాలెట్‌ పత్రాలను లెక్కిస్తారు.

ఒక ఎంపీటీసీ పరిధికి సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత రిటర్నింగ్‌ అధికారి ఫలితాన్ని పరిశీలించి ఆమోదిస్తారు. ఆ తర్వాతే తదుపరి ఎంపీటీసీ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.

జడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపులోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు. లెక్కింపు పూర్తయిన తర్వాత రిటర్నింగ్‌ అధికారి ఫలితాన్ని పరిశీలించి ప్రకటిస్తారు.

ADVERTISEMENT