Sonia Gandhi: సోనియా గాంధీకి ఓటరు జాబితా కేసులో షాక్.. మళ్లీ విచారణకు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ నేత సోనియా గాంధీకి సంబంధించిన ఓటరు జాబితా వివాదంలో ఢిల్లీ సెషన్స్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన ఫిర్యాదును కొట్టివేస్తూ మేజిస్ట్రేట్ కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది. ఆ ఉత్తర్వులో తగిన కారణాలను నమోదు చేయలేదని పేర్కొంటూ.. ఫిర్యాదును చట్ట ప్రకారం మరోసారి పరిశీలించి, కారణాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేయాలని మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది.
వివరాలు
1980లోనే ఓటరు జాబితాలో పేరు?
న్యాయవాది వికాస్ త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్‌లో సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఆమె పేరు ఓటరు జాబితాలో నమోదైందని ఆరోపించారు.
ఆయన వాదన ప్రకారం.. సోనియా గాంధీ పేరు 1980లో న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటరు జాబితాలో నమోదైంది.
1982లో ఆ పేరు తొలగించగా.. 1983లో మళ్లీ చేర్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
సోనియా గాంధీ 1983 ఏప్రిల్ 30న భారత పౌరసత్వం పొందారని,అలాంటప్పుడు అంతకుముందే ఓటరు జాబితాలో పేరు ఎలా నమోదైందన్నదే తన అభ్యంతరమని త్రిపాఠి పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని త్రిపాఠి కోరారు.అయితే మేజిస్ట్రేట్ కోర్టు ఆ అభ్యర్థనను గతంలో తిరస్కరించింది.
దీంతో ఆయన ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.
వివరాలు
మేజిస్ట్రేట్ ఉత్తర్వుపై కోర్టు అభ్యంతరం
ఈ పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే.. మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులో ఫిర్యాదులోని ఆరోపణలకు అనుగుణంగా తగిన కారణాలు నమోదు కాలేదని పేర్కొన్నారు.
ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై సమగ్రంగా పరిశీలన జరగాల్సి ఉన్నప్పటికీ.. అందుకు అవసరమైన విధానాన్ని దిగువ కోర్టు పూర్తిగా అనుసరించలేదని తెలిపారు.
అలాగే ఢిల్లీ పోలీసుల నుంచి స్టేటస్ రిపోర్టు కోరేందుకు, దర్యాప్తు అధికారిని వాదనలు వినేందుకు మేజిస్ట్రేట్ కోర్టు తగిన అవకాశం ఇవ్వలేదని ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది.
పోలీసుల స్పందనను పూర్తిగా పరిశీలించకుండానే ఫిర్యాదును తిరస్కరించడం సరైన విధానం కాదని స్పష్టం చేసింది.
వివరాలు
మళ్లీ మేజిస్ట్రేట్ కోర్టుకే..
దీంతో గతంలో ఇచ్చిన మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులను సెషన్స్ కోర్టు రద్దు చేసి.. ఫిర్యాదును తిరిగి అదే కోర్టుకు పంపించింది.
ఫిర్యాదుదారు, ఢిల్లీ పోలీసుల వాదనలు విన్న తర్వాత చట్ట ప్రకారం కొత్తగా పరిశీలించి, తగిన కారణాలతో ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది.