
Supreme Court: డబ్బును తిరిగి పొందడానికి కోర్టులేమైనా రికవరీ ఏజెంట్లా: సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
డబ్బులు వసూలు చేసే ఏజెంట్లుగా కోర్టులను ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సివిల్ వివాదాలను క్రిమినల్ కేసులుగా మలచే ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక కేసు విచారణ సందర్భంగా ఈ అభిప్రాయాలు తెలిపింది. డబ్బు బకాయిల వంటి సివిల్ సమస్యల్లో అరెస్టులను ఒక సాధనంగా వాడకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. ఆకేసులో కిడ్నాప్ ఆరోపణలు మోపబడిన విషయంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. క్రిమినల్ చట్టాన్ని దుర్వినియోగం చేసే ధోరణికి ఇది ఒక ఉదాహరణ అని వ్యాఖ్యానించింది. ఈతరహా కేసులు న్యాయవ్యవస్థపై పెద్ద ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది. ''బకాయిల వసూళ్ల కోసం కోర్టులు రికవరీ ఏజెంట్లుగా మారవు.న్యాయ వ్యవస్థ దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం''అని స్పష్టం చేసింది.
వివరాలు
ఇలాంటి కేసులు పోలీసుల్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేస్తాయి: సుప్రీం
అరెస్టు చేసే ముందు పోలీసులు తమవద్దకు వచ్చిన కేసు నిజంగా క్రిమినల్ కోవకు చెందుతుందా, లేక సివిల్ వివాదమా అన్నది జాగ్రత్తగా పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇలాంటి కేసులు పోలీసులను కూడా క్లిష్ట పరిస్థితుల్లోకి నెడతాయని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ తరఫున వాదించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ అంగీకరించారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి అయోమయం ఉండొచ్చని కోర్టు గుర్తుచేసి, సివిల్ వివాదాల్లో వేధింపుల సాధనంగా క్రిమినల్ చట్టాలను వాడకుండా నిరోధించేందుకు తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.