LOADING...
Kadapa: కడపలో కొవిడ్‌ కేసులు.. జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు
కడపలో కొవిడ్‌ కేసులు.. జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు

Kadapa: కడపలో కొవిడ్‌ కేసులు.. జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2026
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

కడప జిల్లాలో తాజాగా కొవిడ్‌-19 కేసులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అన్ని జిల్లాల అధికారులకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ పరిస్థితులపై నిరంతర నిఘా కొనసాగించడంతో పాటు పరీక్షలు, వైద్య సన్నద్ధత, ముందస్తు చర్యలను మరింత వేగవంతం చేయాలని సూచించింది. రాష్ట్ర సర్వైలెన్స్‌ అధికారి ద్వారా అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు స్పష్టమైన మార్గదర్శకాలు పంపించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నింటిలోనూ ఇన్‌ఫ్లుయెంజా లక్షణాలు, తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో వచ్చే రోగులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించింది.

వివరాలు 

కేసు వివరాలను సమీకృత సమాచార ప్లాట్‌ఫాం పోర్టల్‌లో నమోదు చేయాలి 

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్‌ లక్షణాలు కనిపించే వారి నుంచి వెంటనే శాంపిల్స్‌ సేకరించి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణైన ప్రతి కేసు వివరాలను ఆలస్యం చేయకుండా సమీకృత సమాచార ప్లాట్‌ఫాం (Integrated Information Platform) పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఆర్టీ-పీసీఆర్‌ టెస్టింగ్‌ కిట్లు, వీటీఎం మీడియా, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, ఆక్సిజన్‌, అవసరమైన మందులు వంటి కీలక వైద్య సామగ్రిని తగినంత నిల్వ ఉంచుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అలాగే ఐసొలేషన్‌ వార్డులు, ఆక్సిజన్‌ పడకలు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు, అత్యవసర రవాణా వ్యవస్థలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా వాటి పనితీరును పరిశీలించాలని సూచించింది.

వివరాలు 

కొవిడ్‌ ప్రోటోకాల్‌ను పూర్తిగా పాటించేలా ప్రత్యేక అంబులెన్స్‌ సేవలు

కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన నమూనాలను నిబంధనల ప్రకారం వెంటనే జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌ కోసం గుర్తించిన ప్రయోగశాలలకు పంపించాలని ఆదేశించింది. కొవిడ్‌ ప్రోటోకాల్‌ను పూర్తిగా పాటించేలా ప్రత్యేక అంబులెన్స్‌ సేవలు కూడా సిద్ధంగా ఉంచాలని పేర్కొంది. ప్రజల్లో కూడా అప్రమత్తత పెంచాలని ఆరోగ్య శాఖ సూచించింది. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, జ్వరం, దగ్గు, జలుబు లేదా ఇతర కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రిని సంప్రదించాలని అవగాహన కల్పించాలని తెలిపింది.

Advertisement

వివరాలు 

కొవిడ్‌ ప్రోటోకాల్‌ను పూర్తిగా పాటించేలా ప్రత్యేక అంబులెన్స్‌ సేవలు

ప్రస్తుతం ఎవరూ అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అదేవిధంగా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా కొవిడ్‌ కేసులు లేదా మరణాల సంఖ్య అసాధారణంగా పెరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే రాష్ట్ర సర్వైలెన్స్‌ యూనిట్‌కు సమాచారం అందించాలని అన్ని జిల్లాల అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది.

Advertisement