LOADING...
Sabarimala: శబరిమల బంగారం దొంగతనం కేసులో సీపీఐ(ఎం) నేత అరెస్టు
శబరిమల బంగారం దొంగతనం కేసులో సీపీఐ(ఎం) నేత అరెస్టు

Sabarimala: శబరిమల బంగారం దొంగతనం కేసులో సీపీఐ(ఎం) నేత అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2025
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

శబరిమల ఆలయ బంగారు ఆస్తుల దుర్వినియోగంపై జరుగుతున్న దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) గురువారం పెద్ద షాక్ ఇచ్చింది. ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) మాజీ చైర్మన్‌గా పనిచేసిన, సీపీఐ(ఎం) ప్రముఖ నాయకుడు ఏ. పద్మకుమార్‌ను అరెస్టు చేసింది. పథనంతిట్ట జిల్లా లోని కొన్నీ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యేగా కూడా ఉన్న ఆయనను, ఈ కేసులో ఎనిమిదో నిందితుడిగా SIT జాబితాలో చేర్చారు.

వివరాలు 

పద్మకుమార్ హయాంలోనే మాయం 

ముఖ్య నిందితుడు ఉన్నికృష్ణన్ పోట్టికి 'ద్వారపాలక' విగ్రహాలపై ఉన్న బంగారు పూత పలకలను రీప్లేటింగ్ కోసం చెన్నైకి తీసుకెళ్లేందుకు మొదటిసారి అనుమతి TDB ఇచ్చింది. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు,అంటే 2019లో,పద్మకుమార్ బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ పలకలకు అసలు బంగారు పూత 1998లో వేశారు.కానీ 2019లో తిరిగి ఆలయానికి చేరుకున్నప్పుడు, వాటిలో కనీసం నాలుగు కిలోల బంగారం గల్లంతైందని కేరళ హైకోర్టు ఇటీవల ఆధారాలతో పేర్కొంది. దీంతో దేవస్వమ్ బోర్డు అధికారులపై బంగారం దోపిడీ ఆరోపణలు బల పడ్డాయి. అరెస్టుకు కొద్దిసమయం ముందు, SIT అధికారులు పద్మకుమార్‌ను తిరువనంతపురంలోని ఒక రహస్య ప్రాంతంలో ప్రశ్నించినట్లు సమాచారం. తనకు బంగారం మాయం గురించి ఏమీ తెలియదని,తాను నిర్దోషినని ఆయన విచారణ సమయంలో చెప్పినట్టుగా తెలుస్తోంది.

వివరాలు 

దర్యాప్తు ముమ్మరం 

హైకోర్టు ఆదేశాలతో జరుగుతున్న మండల-మకరవిళక్కు సీజన్ నడుమ, శబరిమల ఆలయంలోని బంగారు పూత పలకలకు SIT శాస్త్రీయ పరీక్షలు నిర్వహించిన కొద్ది రోజుల్లోనే పద్మకుమార్ అరెస్టు కావడం పెద్ద పరిణామంగా భావిస్తున్నారు. ఇకపోతే, పద్మకుమార్‌కు ముందు మరో మాజీ TDB చైర్మన్, సీపీఐ(ఎం) నాయకుడు ఎన్. వాసు, సస్పెండ్ అయిన దేవస్వమ్ అధికారి డి. మురారి బాబు, అలాగే ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పోట్టిలను SIT ముందే అరెస్టు చేసిందని అధికారులు తెలిపారు. దొంగిలించిన బంగారంపై మరింత సమాచారాన్ని రాబట్టేందుకు వాసు-పద్మకుమార్‌లను కలిసి ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.

వివరాలు 

రాజకీయ రగడ 

సీపీఐ(ఎం) నేత అరెస్టుపై ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. "శబరిమల ఆలయం నుంచి దోపిడీ చేసినవాళ్లు ఒక్కోకరుగా జైలుకి చేరుతున్నారు. ముఖ్యమంత్రికి దగ్గర వ్యక్తిగా భావించే ఎన్. వాసు అరెస్టు అయ్యారు. ఇప్పుడు పద్మకుమార్ కూడా వచ్చారు. మాజీ దేవస్వమ్ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ను SIT తప్పనిసరిగా ప్రశ్నించాలి. ఈ బంగారు దోపిడీలో ఆయన పాత్ర ఉందని మా అభిప్రాయం" అని సతీశన్ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఇదే విషయంపై సీపీఐ(ఎం)ని దుయ్యబట్టారు. "రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక్క ఆకు కూడా కదలదు. ఈ బంగారం దోపిడీలో సీపీఐ(ఎం) నాయకత్వం నేరుగా సంబంధం కలిగి ఉంది" అని ఆయన ఆరోపించారు.

వివరాలు 

రాజకీయ రగడ 

ఇక ఈ ఆరోపణలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ పూర్తిగా ఖండించారు. "శబరిమల నుంచి ఒక్క గ్రాము బంగారం కూడా దొంగిలించడం అసాధ్యం. SIT ఎవరైనా పొరపాటు చేసినవారిని పట్టుకోవచ్చు. పార్టీ ఎవరినీ కాపాడదు. ఈ దోపిడీతో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు" అని ఆయన స్పష్టంచేశారు.