Crop Insurance: ఖరీఫ్ పంటలకు బీమా.. జులై 31లోగా ప్రీమియం చెల్లించండి
ఈ వార్తాకథనం ఏంటి
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు పంటల బీమా చేయించుకోవడం ఎంతో కీలకమని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్నా ఆర్థిక నష్టాన్ని కొంతవరకు తగ్గించుకునే అవకాశం బీమాతో లభిస్తుంది. పంటల బీమా కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రైతులు తమ మొబైల్ ఫోన్‌లోనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సులభంగా నమోదు చేసుకోవచ్చు. అలాగే పీఎంఎఫ్‌బీవై అధికారిక పోర్టల్, మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు (CSC), కంప్యూటర్ కేంద్రాల ద్వారా కూడా ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది.
వివరాలు
ప్రీమియం చెల్లిస్తే వెంటనే రశీదు.. సంబంధిత పంటకు బీమా రక్షణ
బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులతో పాటు రుణాలు తీసుకోని రైతులు కూడా ఈ బీమా పథకంలో చేరి ప్రీమియం చెల్లించవచ్చు.
గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.
రైతులు స్వయంగా ప్రీమియం చెల్లిస్తే వెంటనే రశీదు లభించి, సంబంధిత పంటకు బీమా రక్షణ అమల్లోకి వస్తుంది.
అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు పంటల బీమా నమోదు ఆశించిన స్థాయిలో జరగలేదు.
ఆదివారం నాటికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేవలం 2.19 లక్షల ఎకరాలకు, పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా (RWBCIS) కింద 3.30 లక్షల ఎకరాలకు మాత్రమే ప్రీమియం చెల్లించారు.
వివరాలు
పంటల బీమా గడువు ఇలా..
అధికశాతం పంటలకు జులై 31తో గడువు ముగియనున్నందున రైతులు ఆలస్యం చేయకుండా నమోదు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
కొన్ని జిల్లాల్లో మిరప, పత్తి పంటలకు ప్రీమియం అధికంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కొంత భారం భరిస్తే రైతులకు ఉపశమనం కలుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో వరి మినహా అన్ని పంటలకు జులై 31లోపు ప్రీమియం చెల్లించాలి.
వరి పంటకు మాత్రం ఆగస్టు 15 వరకు అవకాశం ఉంది. పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంలో అనంతపురం,పల్నాడు,అల్లూరి సీతారామరాజు,అంబేడ్కర్ కోనసీమ, నంద్యాల,బాపట్ల, అనకాపల్లి, ప్రకాశం, ఏలూరు, కర్నూలు జిల్లాల రైతులు ఈ నెలాఖరు వరకు ప్రీమియం చెల్లించవచ్చు.
మిగిలిన జిల్లాల్లో జులై 24లోపే నమోదు పూర్తి చేయాలి.
వివరాలు
మొబైల్‌తోనే సులభంగా నమోదు
పీఎంఎఫ్‌బీవై పోర్టల్‌లో ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకుని లేదా ఆండ్రాయిడ్ మొబైల్‌లో పీఎంఎఫ్‌బీవై యాప్‌ను డౌన్‌లోడ్ చేసి రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
ఒకసారి నమోదు పూర్తయిన తర్వాత భూమి విస్తీర్ణం, సర్వే వివరాలు అందులో కనిపిస్తాయి. వాటికి అనుగుణంగా సాగు చేసిన పంటను ఎంపిక చేసి నిర్ణీత ప్రీమియం చెల్లించాలి.
అయితే రైతులు తప్పనిసరిగా వాస్తవంగా సాగు చేస్తున్న పంటనే నమోదు చేయాలి. అందుకు రైతు ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.
ఈ-క్రాప్ నమోదు సమయంలో వివరాలు సరిపోలకపోతే లేదా పొలం ఖాళీగా ఉన్నా,నమోదు చేసిన పంటకు భిన్నంగా సాగు చేసినట్లు తేలినా బీమా దరఖాస్తును తిరస్కరిస్తారు.
అందువల్ల రైతులు సరైన వివరాలతోనే ప్రీమియం చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు.
వివరాలు
ప్రధాన పంటలు.. జిల్లాల వారీగా ప్రీమియం,బీమా మొత్తం
కంది (ఎకరానికి)
ప్రీమియం: వైఎస్సార్ కడప రూ.36, పల్నాడు రూ.40, కర్నూలు రూ.44, అనంతపురం రూ.80, శ్రీసత్యసాయి రూ.102, అన్నమయ్య రూ.300, నంద్యాల, చిత్తూరు, బాపట్ల జిల్లాల్లో రూ.400, ప్రకాశం రూ.430.
బీమా మొత్తం: రూ.18,000 నుంచి రూ.21,500 వరకు.
పత్తి (వాతావరణ ఆధారిత బీమా - ఎకరానికి) ప్రీమియం: అనంతపురం రూ.1,140, నంద్యాల రూ.1,600, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రూ.1,900, కాకినాడ, కర్నూలు, వైఎస్సార్ కడప, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో రూ.2,000, ప్రకాశం రూ.2,100.
బీమా మొత్తం: రూ.38,000 నుంచి రూ.40,000 వరకు.
వివరాలు
ప్రధాన పంటలు.. జిల్లాల వారీగా ప్రీమియం,బీమా మొత్తం
వరి (ఎకరానికి) ప్రీమియం: అంబేడ్కర్ కోనసీమ రూ.76, పల్నాడు, కర్నూలు రూ.80, వైఎస్సార్ కడప, అనకాపల్లి రూ.84, శ్రీకాకుళం రూ.160, అనంతపురం రూ.164, తిరుపతి రూ.168, విజయనగరం, శ్రీసత్యసాయి రూ.200, పశ్చిమగోదావరి రూ.210, విశాఖపట్నం రూ.420, తూర్పుగోదావరి రూ.570, అల్లూరి సీతారామరాజు రూ.638, కాకినాడ రూ.760, నంద్యాల, గుంటూరు, బాపట్ల, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రూ.800, కృష్ణా రూ.830, ఏలూరు, చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో రూ.840, ఎన్టీఆర్ రూ.850, ప్రకాశం రూ.860.
బీమా మొత్తం: రూ.40,000 నుంచి రూ.41,400 వరకు.
వివరాలు
ప్రధాన పంటలు.. జిల్లాల వారీగా ప్రీమియం,బీమా మొత్తం
వేరుశనగ (ఎకరానికి) ప్రీమియం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు రూ.280, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల్లో రూ.560, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రూ.640. బీమా మొత్తం: రూ.28,000 నుంచి రూ.32,000 వరకు.
మిరప (ఎకరానికి) ప్రీమియం: పల్నాడు, కర్నూలు రూ.360, అనంతపురం రూ.576, ఎన్టీఆర్, బాపట్ల రూ.1,800, గుంటూరు రూ.2,700, నంద్యాల రూ.2,880, ప్రకాశం రూ.4,500. బీమా మొత్తం: గరిష్ఠంగా రూ.90,000 వరకు.
జొన్న (ఎకరానికి) ప్రీమియం: వైఎస్సార్ కడప, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో రూ.38, గుంటూరు రూ.48, అనంతపురం రూ.84, నంద్యాల రూ.190. బీమా మొత్తం: రూ.19,000 వరకు.