Telangana: తెలంగాణలో మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ "200 యూనిట్లు వాడేవారికి ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్సు" వంటి హామీలతో అధికారంలోకి వచ్చింది. కానీ, ఈ హామీలను అమలు చేయడంలో విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు కాంగ్రెస్ హయాంలోనే ప్రభుత్వాలు చెరువులు, కుంటలు పరిధిలో ఉన్న ఎఫ్.టీఎల్. ప్రాంతాల్లో కట్టడాలకు అనుమతులు ఇచ్చాయని విమర్శిస్తున్నాయి. ఇక ఉచిత విద్యుత్ అంశంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం, కొందరికే విద్యుత్ ఉచితంగా ఇచ్చి అందరికీ ఇస్తున్నట్టు హడావిడి చేయడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఉచిత విద్యుత్ పథకం కింద నెల నెలా కరెంటు బిల్లులు కట్టే వారిపై అధిక భారాన్ని వేస్తూ, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
విద్యుత్ ఛార్జీల సవరణకు ప్రతిపాదనలు
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) విద్యుత్ ఛార్జీల సవరణకు ప్రతిపాదనలు సమర్పించాయి. మూడు కేటగిరీల్లో ఛార్జీలను సవరించాలని డిస్కంలు కోరాయి. దీనివల్ల సుమారు 1,200 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. ఇళ్లకు 300యూనిట్లు దాటినట్లైతే ప్రతి కిలోవాట్‌కు ఫిక్స్‌డ్ ఛార్జీ పెరుగుతుంది. ప్రస్తుతం రూ.10గా ఉన్న ఈ ఛార్జీని రూ.50కి పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. కానీ, 200యూనిట్ల లోపు వాడేవారికి ఉచితంగా సరఫరా కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణలో మొత్తం 1.30కోట్లకు పైగా ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నప్పటికీ, వాటిలో 80శాతం మంది 300యూనిట్ల లోపు విద్యుత్ వాడుతున్నారని సమాచారం. ఉచిత విద్యుత్ హామీ ఇచ్చినా,అధికంగా బిల్లులు కట్టే వారికి ఛార్జీలు పెంచడంతో ప్రభుత్వం వారిపై ఒత్తిడి పెంచబోతున్నట్టు తెలుస్తుంది.