CWC: 7న తెలంగాణ, ఏపీ జల వివాదాల కమిటీ రెండో భేటీ.. ఎజెండాలపై చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాలకు పరిష్కారం కనుగొనే దిశగా కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ రెండోసారి సమావేశం కానుంది. ఈ నెల 7న సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు గురువారం లేఖలు పంపింది. ఇరురాష్ట్రాలు తమ ఎజెండాలను అందజేసి సమావేశానికి హాజరు కావాలని సూచించింది. గతేడాది జులైలో దిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల సమస్యలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆ సందర్భంగా కేంద్రం సూచించింది.
వివరాలు
జనవరి 30న దిల్లీలో కమిటీ తొలి సమావేశం
ఈ నేపథ్యంలోనే తెలంగాణ నీటిపారుదలశాఖ, ఏపీ జలవనరులశాఖ అధికారులతో పాటు కేంద్ర జలసంఘం అధికారులను కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీకి కేంద్ర జలసంఘం ఛైర్మన్ అధ్యక్షత వహిస్తున్నారు.
కమిటీ తొలి సమావేశం జనవరి 30న దిల్లీలో జరిగింది. తెలంగాణ,ఏపీకి చెందిన అధికారులు ఆ భేటీలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
రెండు రాష్ట్రాలు తమ తమ ఎజెండాలను ఖరారు చేసి కేంద్రానికి పంపిన తర్వాత 15 రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహించాలని తొలి భేటీలో నిర్ణయించారు.
అయితే,ఏపీ ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధానం అంశాన్ని ఎజెండాలో చేర్చకూడదని తెలంగాణ అధికారులు సమావేశంలో స్పష్టం చేసినట్లు అప్పటి నీటిపారుదలశాఖ కార్యదర్శి తెలిపారు.
వివరాలు
సీడబ్ల్యూసీ ఇరురాష్ట్రాలకు లేఖలు
తెలంగాణ అధికారులు మొత్తం 12 అంశాలను సిద్ధం చేసుకుని సమావేశానికి హాజరైనప్పటికీ.. వాటిని ఆ భేటీలో కమిటీకి అధికారికంగా సమర్పించలేదని అప్పట్లో వెల్లడించారు.
మరోవైపు ఏపీతో పాటు గోదావరి బోర్డు కూడా పలు అంశాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లింది.
రెండు రాష్ట్రాలు తమ ఎజెండాలను పంపిన తర్వాతే తదుపరి సమావేశాన్ని నిర్వహిస్తామని సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ అప్పట్లో స్పష్టం చేశారు.
అయితే, తొలి సమావేశం జరిగి దాదాపు ఏడు నెలలు గడిచినా తెలంగాణ, ఏపీ ఇప్పటివరకు తమ ఎజెండాలను కేంద్రానికి సమర్పించలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా సీడబ్ల్యూసీ ఇరురాష్ట్రాలకు లేఖలు పంపింది.
ఇప్పటికైనా ఎజెండాలను అందజేసి ఈ నెల 7న నిర్వహించనున్న కమిటీ రెండో సమావేశానికి హాజరు కావాలని కోరింది.