Loading...
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్‌.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం
అతి తీవ్ర తుపానుగా అక్వాన్‌.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం

Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్‌.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
08:04 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి 'అక్వాన్‌'గా పేరు పెట్టారు. ప్రస్తుతం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను మంగళవారం సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. తాజా వాతావరణ అంచనాల ప్రకారం ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించనుంది. గురువారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు నుంచి తుని మధ్యలో ఎక్కడైనా తీరం దాటవచ్చని భావిస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

వివరాలు 

కోస్తాంధ్రకు తుపాను ముప్పు

'అక్వాన్‌' అతి తీవ్ర తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

తుపాను ప్రభావంతో బుధవారం నుంచి కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గురు,శుక్రవారాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వివరాలు 

కోస్తాంధ్రకు తుపాను ముప్పు

విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, మార్కాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఎన్టీఆర్‌, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 21 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని హెచ్చరించారు.

ADVERTISEMENT

వివరాలు 

తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: సీఎం

ఈ నెల 20న కోస్తాంధ్ర తీరాన్ని తీవ్ర తుపాను తాకే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ కేంద్రంలో రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ముఖ్యంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి తదితర జిల్లాలపై తుపాను ప్రభావం ఉండొచ్చని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: సీఎం

వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాలకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలను ముందుగానే పంపించాలని ఆదేశించారు.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు, సంబంధిత శాఖలు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

వివరాలు 

377 మంది గర్భిణులు ఆసుపత్రులకు తరలింపు

తుపాను హెచ్చరికల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది.

ప్రసవ సమయం దగ్గరపడిన 377 మంది గర్భిణులను ముందస్తు జాగ్రత్తగా ఆసుపత్రులకు తరలించినట్లు ఆ శాఖ వెల్లడించింది.

తుపాను సమయంలో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

ADVERTISEMENT