Andhra News: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. హోంమంత్రి కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపుకు కదులుతూ, తదుపరి 12 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా,రాయలసీమ ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి అనిత ఈ రోజు (బుధవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని హోం మంత్రి అనిత సూచించారు.
వివరాలు
24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నంబర్లు
సహయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, పోలిస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. జిల్లాల్లోని కంట్రోల్ రూమ్స్ ఎప్పుడూ అలర్ట్‌లో ఉండేలా చూసుకోవాలని, ప్రాణనష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపాలని అధికారులను హెచ్చరించారు. సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నంబర్లు: 112, 1070, 18004250101. ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఉండేలా చూసుకోవాలని హోంమంత్రి ప్రత్యేకంగా అభ్యర్థించారు.
వివరాలు
అధికారులు సిద్ధంగా ఉండండి: మంత్రి అనగాని
రాష్ట్రానికి వాయుగుండం ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో, రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను అప్రమత్తం చేశారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్న కారణంగా: రెవెన్యూ అధికారులు అన్ని ఏర్పాట్లలో సిద్ధంగా ఉండాలి. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాగులు పొంగే ప్రాంతాల్లోని ప్రజలకు ముందే హెచ్చరికలు ఇవ్వాలి. చెట్లు విరిగిపడే ప్రాంతాల్లో ప్రజా రవాణాకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచి, అధికారులు సహాయక చర్యల్లో పూర్తి స్థాయిలో పాల్గొనాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.