Cyclone Arnab: అర్నబ్ తుపానుతో రూ.4,600 కోట్ల నష్టం.. రెండు రోజుల్లో విద్యుత్తు పునరుద్ధరణ: సీఎం చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
అర్నబ్ తుపాను రాష్ట్రంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తుపాను కదలికలను గంటగంటకూ పర్యవేక్షించామని, ముందస్తు చర్యలతో ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని చెప్పారు. అయితే ఆస్తి నష్టాన్ని పూర్తిగా నివారించలేకపోయామని, ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రానికి రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. బాధితులను ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరినట్లు తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలు శుక్రవారం రాష్ట్రానికి రానున్నాయని పేర్కొన్నారు.
వివరాలు
తుపాను బాధితులను పరామర్శించిన చంద్రబాబు..
గురువారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో ముఖ్యమంత్రి పర్యటించారు.
తుపాను కారణంగా నష్టపోయిన రైతులు, ముంపు ప్రాంతాల ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తుపాను సమాచారం అందిన వెంటనే 30 వేల మంది అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు.
ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని భావించినప్పటికీ, గోడ కూలడం, విద్యుదాఘాతం వంటి ప్రమాదాలతో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవడానికే పర్యటన చేపట్టినట్లు వివరించారు.
వివరాలు
10 వేలకు పైగా విద్యుత్తు స్తంభాలు నేలమట్టం
అర్నబ్ తుపాను గాలుల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా 10 వేలకు పైగా విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయని చంద్రబాబు తెలిపారు.
వీటిలో ఒక్క కోనసీమ జిల్లాలోనే 8 వేల స్తంభాలు ఉన్నాయని చెప్పారు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ కోసం ప్రస్తుతం 2 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని వెల్లడించారు.
మరో వెయ్యి మంది విద్యుత్తు సిబ్బందిని పంపించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరగా, అందుకు సానుకూలంగా స్పందించిందన్నారు.
అవసరమైతే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా సిబ్బందిని రప్పిస్తామని చెప్పారు.
ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించామని, మరో రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వంద శాతం విద్యుత్తు సరఫరా అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం హామీ ఇచ్చారు.
తుపాను కారణంగా వేల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయని తెలిపారు.
వివరాలు
మొబైల్ నెట్‌వర్క్ సమస్యలపైనా స్పందించని సీఎం
అర్నబ్ తుపాను ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించామని గుర్తుచేశారు.
అయితే కాకినాడకు చెందిన కొందరు సామాజిక మాధ్యమాల్లో మంగళవారం తుపాను రాకపోయినా సెలవులు ఎందుకు ప్రకటించారంటూ ఎగతాళి చేశారని చెప్పారు.
ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే ప్రాణనష్టం తగ్గిందని స్పష్టం చేశారు.
తుపాను ప్రారంభం కాకముందే రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్), అగ్నిమాపక, పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు.
దీంతో బుధవారం నాటికే రవాణాకు ఇబ్బంది లేకుండా రహదారులపై పడిపోయిన చెట్లను తొలగించి మార్గాలను పునరుద్ధరించగలిగామని వివరించారు.
మరోవైపు మొబైల్ నెట్‌వర్క్ సమస్యలపైనా సీఎం స్పందించారు.
టెలికం సంస్థలు తమ సెల్ టవర్లు పనిచేసేలా జనరేటర్లకు డీజిల్ అందుబాటులో ఉంచాలని సూచించారు.
వివరాలు
30 ఏళ్ల క్రితం కూడా ఇదే ప్రాంతంలో పర్యటించా..
ఇందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలిపారు.
శుక్రవారం నాటికి మొబైల్ సిగ్నల్ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలు తుపాను ప్రభావానికి తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు.
గతంలో హుద్‌హుద్, తిత్లీ, మొంథా తుపాన్లను ఎదుర్కొన్నామని, ఇప్పుడు అర్నబ్ తుపాను ప్రభావాన్ని కూడా ఎదుర్కొంటున్నామని చంద్రబాబు తెలిపారు.
1996లో వచ్చిన హరికేన్ తుపాను ఈ ప్రాంతంలో తీవ్ర విధ్వంసం సృష్టించిందని గుర్తుచేశారు.
అప్పట్లో హెలికాప్టర్‌లో వచ్చి ముమ్మిడివరం రోడ్డుపై దిగిన అనంతరం తుపాను నష్టాన్ని పరిశీలించినట్లు చెప్పారు.
అప్పటి పరిస్థితుల్లో రాజమహేంద్రవరం ఆర్డీవో కార్యాలయంలో ఎనిమిది రోజుల పాటు సచివాలయాన్ని నిర్వహించామని వివరించారు.
వివరాలు
మరో 15 రోజుల్లో కోతకు రావాల్సిన పంట దెబ్బతింది
తుపాను కారణంగా చేతికందాల్సిన పంటలు దెబ్బతిన్నాయని రైతులు ముఖ్యమంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
మరో 15 రోజుల్లో కోతకు సిద్ధం కావాల్సిన పంటలు నీట మునిగాయని, దీంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని వివరించారు.
తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ముఖ్యమంత్రి తొలుత కాట్రేనికోన మండలం చెయ్యేరు గున్నేపల్లిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగారు.
అక్కడి నుంచి సుమారు 15 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి గచ్చకాయలపొరలోని తుపాను బాధితుల పునరావాస కేంద్రానికి చేరుకున్నారు.
మార్గమధ్యంలో వేట్లపాలెం వద్ద నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు.
పంటలకు బీమా చేయించారా అని అడగ్గా.. ఇప్పటికే బీమా చేయించామని రైతులు తెలిపారు.
వివరాలు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా నీట మునిగిన వరి పొలాలు, దెబ్బతిన్న అరటి తోటలు, కొబ్బరి తోటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు.
వివరాలు
కొబ్బరి చెట్టుకు రూ.1,500 పరిహారం
తుపాను కారణంగా కొబ్బరి చెట్ల మొవ్వలు దెబ్బతిన్నాయని, దీంతో చెట్ల నుంచి వచ్చే దిగుబడి పూర్తిగా కోల్పోయామని రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
చాలా చెట్లు నేలకొరిగాయని, వాటి వల్ల జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై స్పందించిన చంద్రబాబు.. ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1,500, ఆయిల్‌పామ్ చెట్టుకు రూ.1,500 చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు.
తుపాను బాధితులకు మొత్తం 57 రకాల నష్టపరిహారాలు అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
వివరాలు
బాధిత ప్రాంతాల్లో తాగునీటి సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ
పర్యటనలో భాగంగా విద్యుత్తు పునరుద్ధరణ పనులను కూడా సీఎం పరిశీలించారు. పనుల పురోగతిని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఆయనకు వివరించారు.
ముంపు ప్రాంతాలకు చెందిన మహిళలతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు.
తుపాను కారణంగా తమ గుడిసెలు కూలిపోయాయని మహిళలు చెప్పడంతో,వాటి పునర్నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న అర్హులైన వారికి పట్టాలు ఇచ్చే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
బాధిత ప్రాంతాల్లో తాగునీటి సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పునరావాస కేంద్రాల్లో ఉంటున్న బాధితులు తిరిగి తమ ఇళ్లకు వెళ్లే సమయంలో ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు ఇతర ఖర్చుల కోసం నగదు సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
వివరాలు
అర్నబ్ తుపాను సహాయక చర్యలపై అమిత్‌షా సమీక్ష
ఈ పర్యటనలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు, ఎంపీలు హరీష్ మాథుర్, సానా సతీష్‌బాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు.
అర్నబ్ తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు, నష్టాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రితో ఆయన ఫోన్‌లో మాట్లాడారు.
వివరాలు
అర్నబ్ తుపాను సహాయక చర్యలపై అమిత్‌షా సమీక్ష
తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని తగ్గించేందుకు, బాధిత ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని అమిత్‌షా హామీ ఇచ్చారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.
బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు పునరావాస కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని వివరించారు.
తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయడానికి, అవసరమైన సహాయాన్ని అందించడానికి త్వరలో కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన బృందాలను పంపించనున్నట్లు అమిత్‌షా తెలిపారు.
ఈ వివరాలను ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.