Loading...
Cyclone Arnab: అర్నబ్ తుపాను బీభత్సం.. కృష్ణా జిల్లాలో అస్తవ్యస్తమైన జనజీవనం
అర్నబ్ తుపాను బీభత్సం.. కృష్ణా జిల్లాలో అస్తవ్యస్తమైన జనజీవనం

Cyclone Arnab: అర్నబ్ తుపాను బీభత్సం.. కృష్ణా జిల్లాలో అస్తవ్యస్తమైన జనజీవనం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

అర్నబ్ తుపాను మచిలీపట్నం సమీపం నుంచి వెళ్లిపోయినా కృష్ణా జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. అనేకచోట్ల విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. రహదారుల పక్కన, పొలాల్లో, జనావాసాల మధ్య చెట్లు కూలిపోవడం, విద్యుత్తు తీగలు తెగిపడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు, విద్యుత్తు సరఫరా నిలిచిపోయాయి. మరోవైపు భారీ వర్షాలకు పంట పొలాలు నీటమునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

వివరాలు 

రాకపోకలకు తీవ్ర అంతరాయం

తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా అనేకచోట్ల భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా నేలకూలాయి.

దీంతో రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మచిలీపట్నంతో పాటు అవనిగడ్డ, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం ఆర్టీసీ డిపోల నుంచి నడిచే పలు బస్సు సర్వీసులను అధికారులు నిలిపివేశారు.

మంగళవారం రాత్రి బయలుదేరిన నైట్‌ఔట్‌ బస్సులు కూడా మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది.

మచిలీపట్నం నుంచి సింగరాయపాలెం వెళ్లిన నైట్‌ఔట్‌ బస్సు బుధవారం మధ్యాహ్నం వరకు తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది.

రోడ్లపై చెట్లు అడ్డంగా పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

బందరు, అవనిగడ్డ, కృత్తివెన్ను, బంటుమిల్లి తదితర మండలాల్లో పెద్ద సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

వివరాలు 

నేడు పాఠశాలలకు సెలవు

మచిలీపట్నం నగరంలో బుధవారం అర్ధరాత్రి వరకు కూడా విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాలు చీకట్లోనే ఉండిపోయాయి.

తుపాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

మరోవైపు క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గురువారం కూడా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

జలదిగ్బంధంలో మచిలీపట్నం నగరం

భారీ వర్షాలకు మచిలీపట్నం నగరం నీటమునిగింది. ఎటుచూసినా నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.

చిరువ్యాపారులు ఉపాధి కోల్పోయి ఇళ్లకే పరిమితమయ్యారు. పెడన బస్టాండ్‌ నుంచి రైల్వే ట్రాక్‌ వరకు నడుములోతు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

బంటుమిల్లి, కృత్తివెన్ను, కంకిపాడు, కోడూరు తదితర మండలాల్లో పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గుడివాడ, ఉయ్యూరు పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి.

ADVERTISEMENT

వివరాలు 

జిల్లాలో 177 పునరావాస కేంద్రాలు

భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.

జిల్లాలోని 26 మండలాల్లో మొత్తం 177 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 15 వేల మందికి పైగా ఆశ్రయం కల్పించారు.

మచిలీపట్నం డివిజన్‌ పరిధిలోనే సుమారు 100 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఆయా కేంద్రాలకు చేరుకున్న బాధితులకు అధికారులు అవసరమైన వసతులు కల్పించారు.

వివరాలు 

కన్నీటి పర్యంతమవుతున్న అన్నదాతలు

మచిలీపట్నం (గొడుగుపేట), బంటుమిల్లి ప్రాంతాల్లో రైతులు తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయారు.

ఏటా పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి తమపై పగబట్టినట్లుగా పరిస్థితులు మారుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అర్నబ్‌ తుపాను తమ పంటలను పూర్తిగా దెబ్బతీసిందని కన్నీటిపర్యంతమవుతున్నారు.

తుపాను మచిలీపట్నం వద్ద తీరం దాటకపోయినా, భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.

నీటిలో మునిగిన పొలాలను చూస్తుంటే ఈసారి పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

34,864 హెక్టార్లలో పంట నీటిపాలు

బందరు మండలంలోని పలు గ్రామాలతో పాటు గుడూరు మండలంలోని మల్లవోలు, గుడూరు, కంకటావ, ముక్కొల్లు, తరకటూరు తదితర గ్రామాల్లోని పంట పొలాలు నీటమునిగాయి.

తీర ప్రాంత మండలాలైన కృత్తివెన్ను, బంటుమిల్లి, బందరు, నాగాయలంక, అవనిగడ్డ, కోడూరుపై తుపాను ప్రభావం ఎక్కువగా కనిపించింది.

జిల్లాలోని ఇతర మండలాల్లోనూ వరి పంటలు నేలవాలిపోయాయి.

జిల్లాలో 80 వేల హెక్టార్లకు పైగా వరి పంట గింజ కట్టే దశలో ఉండగా, మిగిలిన పొలాల్లో వరి చిరుపొట్ట, ఈత దశల్లో ఉంది. భారీ వర్షాల కారణంగా 34,864 హెక్టార్లలో పంట పొలాలు నీటమునిగాయి.

బాపులపాడు, ఉయ్యూరు, ఉంగుటూరు, గన్నవరం తదితర మండలాల్లోని మెట్ట భూముల్లో సాగు చేసిన ఆరుతడి పంటలు కూడా దెబ్బతిన్నాయి.

వివరాలు 

జిల్లాలో 135.3 మి.మీ. వర్షపాతం నమోదు

జిల్లాలో 358 హెక్టార్లలో మినుము, 23 హెక్టార్లలో వేరుశనగ, 25 హెక్టార్లలో చెరకు పంటలు వర్షాల కారణంగా నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

మచిలీపట్నం కార్పొరేషన్‌, మోపిదేవి ప్రాంతాల్లోనూ భారీ వర్షాల ప్రభావం కనిపించింది.

జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు సగటున 135.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

తుపాను కారణంగా జిల్లాలో జరిగిన నష్టానికి సంబంధించిన ప్రాథమిక వివరాలు ఇలా ఉన్నాయి. -

పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లు: 58

పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లు: 6

నేలకూలిన చెట్లు: 274

ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు: 177

పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందినవారు: 15,101 మంది

దెబ్బతిన్న పడవలు: 139

వివరాలు 

కూలిన విద్యుత్తు స్తంభాలు

తుపాను ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి.

ప్రాథమిక వివరాల ప్రకారం 33 కేవీ విద్యుత్తు లైన్లకు సంబంధించి 87 స్తంభాలు, 11 కేవీ లైన్లకు సంబంధించి 137 స్తంభాలు, ఎల్‌టీ లైన్లకు సంబంధించి 120 స్తంభాలు కూలిపోయాయి.

దీంతో విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ పనులకు అంతరాయం ఏర్పడింది.

ADVERTISEMENT