Cyclone Arnab: ఏపీ వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. 12 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
అర్నబ్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్'లోని పలు జిల్లాలపై ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను బలపడిన తర్వాత గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం రాత్రికి వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి 820 కిలోమీటర్లు, కాకినాడకు 910 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,020 కిలోమీటర్లు, బాపట్లకు 1,100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది.
వివరాలు
బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం
సోమవారం ఉదయానికి తూర్పు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉంది.
మంగళవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఆ తర్వాత పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ అతి తీవ్ర తుపానుగా మారే అవకాశముంది.
బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకొని, బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
తుపాను తీరం దాటే సమయంలో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వివరాలు
ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో ఈ నెల 27,28 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
విశాఖపట్నం,అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నెల 29 నాటికి తుపాను తీవ్రత కొంత తగ్గే అవకాశముంది.
అయినప్పటికీ ఏలూరు, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.