Loading...
Cyclone Arnab: ఏపీ వైపు దూసుకొస్తున్న అర్నబ్‌ తుపాను.. తీర ప్రాంతాలకు హెచ్చరిక
ఏపీ వైపు దూసుకొస్తున్న అర్నబ్‌ తుపాను.. తీర ప్రాంతాలకు హెచ్చరిక

Cyclone Arnab: ఏపీ వైపు దూసుకొస్తున్న అర్నబ్‌ తుపాను.. తీర ప్రాంతాలకు హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2026
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

అర్నబ్‌ తుపాను ఆంధ్రప్రదేశ్‌ వైపు దూసుకొస్తోంది. ఇది అతి తీవ్ర తుపానుగా మారి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను ప్రభావం ఒక రోజంతా కొనసాగవచ్చని,ఈ సమయంలో ప్రచండ గాలులతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో తుపాను ప్రభావిత జిల్లాల్లో ప్రభుత్వం మంగళ,బుధవారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరాల్సిన 53 రైళ్లను దక్షిణ కోస్తా రైల్వే రద్దు చేసింది. తుపాను తీరం వైపు వచ్చే కొద్దీ మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

ముంచెత్తనున్న అలలు

అతి తీవ్ర తుపానుగా తీరందాటే సమయంలో బలమైన గాలులు వీచడంతో పాటు తీర ప్రాంతాల్లో 20సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

గంటకు 15కిలోమీటర్ల వేగంతో కదులుతున్న అర్నబ్‌ తుపాను సోమవారం రాత్రికి మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారింది.

మంగళవారం ఉదయానికి అదే ప్రాంతంలో అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ఆ తర్వాత వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి బాపట్ల-విశాఖపట్నం మధ్య యానాంకు సమీపంలో తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు.

తుపాను తీరందాటే సమయంలో గాలుల వేగం గంటకు 115 నుంచి 125కిలోమీటర్ల వరకు ఉండొచ్చని, అప్పుడప్పుడు 140కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

భారీ నష్టం సంభవించే అవకాశం

సముద్రంలో అలలు ఒకటి నుంచి ఒకటిన్నర మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడవచ్చని అంచనా వేస్తున్నారు.

దీంతో తూర్పుగోదావరి, కాకినాడ, యానాం తీర ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

అతి తీవ్ర తుపానుగా అర్నబ్‌ ఎక్కువ సమయం కొనసాగనుండటంతో భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మంగళవారం ఉదయం 11.30 గంటల నుంచి బుధవారం ఉదయం 11.30 గంటల వరకు ఇది అతి తీవ్ర తుపాను స్థాయిలో కొనసాగవచ్చని తెలిపారు.

బుధవారం రాత్రి 11.30 గంటల సమయానికి తుపానుగా బలహీనపడే అవకాశం ఉందని, 29వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా, 30వ తేదీ నాటికి అల్పపీడనంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

దిశ మారితే పరిస్థితి ఎలా?

సోమవారం సాయంత్రం నాటికి తుపాను గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 490 కిలోమీటర్లు, విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 540 కిలోమీటర్లు, శ్రీ విజయపురానికి వాయవ్యంగా 650 కిలోమీటర్లు, కాకినాడకు 620 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 720 కిలోమీటర్లు, బాపట్లకు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ప్రస్తుత అంచనాల ప్రకారం అర్నబ్‌ తుపాను యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.

అయితే దట్టమైన మేఘాల ప్రభావంతో దాని దిశలో మార్పులు చోటుచేసుకునే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

తుపాను దిశ మారితే నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కొన్ని వాతావరణ నమూనాలు ఇది అత్యంత తీవ్ర తుపానుగా మారవచ్చని సూచిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

మంగళ, బుధవారాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది.

మంగళవారం కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది.

పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

వివరాలు 

అప్రమత్తమైన కేంద్రం.. అత్యవసర సమావేశం

అర్నబ్‌ తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించేందుకు సోమవారం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి టి.వి.సోమనాథన్‌ అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎంసీ) అత్యవసర సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పుదుచ్చేరి ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, కోస్ట్‌గార్డ్‌, రక్షణ రంగానికి చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న ముందస్తు చర్యల గురించి అధికారులు కమిటీకి వివరించారు.

అక్టోబరు 26 నుంచి 29వ తేదీ వరకు మత్స్యకారులు బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు.

తుపాను కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి తెలిపారు.

ADVERTISEMENT