Cyclone Ditwah: ఏపీకి 'దిత్వా' ముప్పు.. బంగాళాఖాతంలో తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. అత్యంత భారీ వర్షాలకు అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీపై మరోసారి తుపాను ప్రభావం కన్పించే సూచనలు కనిపిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీరానికి దగ్గరగా ఉన్న తీవ్ర వాయుగుండం గురువారం ఉదయం తుపానుగా మారిందని భారత వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది. ఇది గురువారం సాయంత్రం నాటికి శ్రీలంకలోని బట్టికాలోవాకు సుమారు 20 కి.మీ., పుదుచ్చేరికి 520 కి.మీ., చెన్నైకి 620 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. ఈ వ్యవస్థ ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్ర తీరం వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనితో అండమాన్, నికోబార్, పుదుచ్చేరి, లక్షద్వీప్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది.
వివరాలు
సరస్సు పేరు
ఈ తుపానుకు 'దిత్వా' అనే పేరు పెట్టారు. యెమెన్ సూచించిన ఈ పేరు అక్కడి సోకోట్రా ద్వీపంలోని ప్రముఖ సరస్సు పేరుతో సంబంధం కలిగి ఉంది. రాబోయే నలుగు రోజులపాటు తుపాను బలంగా కొనసాగనుంది. మొదట చెన్నై-పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం తుపాను పూర్తిగా తీరం దాటే అవకాశాలు తక్కువగా ఉండి, తీరం వెంబడి ప్రయాణిస్తూ క్రమంగా బలహీనపడే అవకాశముందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.
వివరాలు
20 సెం.మీ. కంటే ఎక్కువ వర్ష సూచన
తుపాను ప్రభావంతో శుక్రవారం నుంచి మంగళవారం వరకూ ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం కొందరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఆదివారం ఇంకా కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం 20 సెంటీమీటర్లకు మించి నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తా ప్రాంతాల వెంట శుక్రవారం సాయంత్రం నుంచి గాలుల వేగం పెరగగా, శనివారం-ఆదివారాల్లో గంటకు 80 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచవచ్చని అంచనా వేసింది. విశాఖపట్నం, మచిలీపట్నం వంటి పోర్టుల్లో రెండో నంబరు హెచ్చరికలు అమల్లో ఉన్నాయి.
వివరాలు
వర్షాలు ఇలా..
శుక్రవారం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం. శనివారం: నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు. శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ కడప, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్ష సూచన. ఆదివారం: చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్ కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు. నంద్యాల, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు. శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు సంభవించవచ్చు.
వివరాలు
వర్షాలు ఇలా..
సోమవారం: కృష్ణా, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు. వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూలు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. బుధవారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో కనిష్ఠంగా 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.